రోజ్ గార్ మేళా-2023లో ప్రధాని మోడీతో మాట్లాడే అద్భుతమైన అవకాశం తెలంగాణ బిడ్డకు లభించింది. రోజ్ గార్ మేళాలో భద్రాద్రి జిల్లా సుజాత నగర్ మండలం నిమ్మలగూడెం గ్రామానికి చెంది కన్నమల్ల వంశీకృష్ణ ప్రధాని మోడీతో నిన్న మాట్లాడారు. వంశీ కృష్ణ బీటెక్ పూర్తి చేశారు.
ప్రస్తుతం ఆయన మహారాష్ట్రలోని బల్లార్‌పూర్ కాలరీస్‌లోని ‘34 పిట్స్ మైన్’జీఎం కార్యాలయంలో మేనేజ్‌మెంట్ ట్రైనీగా పనిచేస్తున్నారు. రోజ్ గార్ మేళాలో వంశీకృష్ణతో ప్రధాని మాట్లాడుతూ.. మీ తల్లిదండ్రులు చాలా కష్టపడి మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు ఎలా భావిస్తున్నారు? అంటూ ఆయన ప్రశ్నించారు.
దానికి వంశీకృష్ణ బదులిస్తూ…. తన తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ చాలా కష్టపడి తనను చదివించారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సీటు చాలా కష్టపడి సంపాదించానని ఆయన తెలిపారు.
2021లో బీటెక్ పట్టా పొందానని వెల్లడించారు. గతేడాది జూన్‌లో ప్రముఖ బొగ్గు కంపెనీలో తనకు ఉద్యోగం వచ్చిందన్నారు. ‘కర్మయోగి ప్లాట్ ఫాం’ను సద్వినియోగం చేసుకోవడంతో మీతో మాట్లాడే అదృష్టం దక్కిందన్నారు. ఆ అవకాశం దక్కడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు.