ఇందిరాగాంధీ ఎలాంటి నియంతృత్వ ధోరణులను అవలంభించారో, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ కూడా అంతకు మించిన నిరంకుశత్వంతో వ్యవహరిస్తున్నారంటూ ప్రముఖ చరిత్ర కారుడు రామ చంద్రగుహ అన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ ఏక పార్టీగా చలామణి అయిందని, ఇప్పుడు బీజేపీ కూడా అదే బాటలో నడుస్తోందన్నారు.
సైఫాబాద్‌లోని విద్యారణ్య పాఠశాలలో నిర్వహించిన మంథన్ సంవాద్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ సమకాలిన చరిత్ర రచనలో 1947, ఆగస్టు15 అనే లక్ష్మణరేఖను చరిత్ర అధ్యయనకారులు దాటలేకపోయారని ఆయన పేర్కొన్నారు.
వాస్తవానికి భారత స్వాతంత్ర్యనాంతర చరిత్ర మీద ఒకటి, రెండు మినహా చెప్పుకో తగిన రచనలు రాకపోవడం చాలా విచారకరమన్నారు. చరిత్ర అనేది ఒక ఏరులా పారుతుండాలన్నారు. అంతేకానీ, దానికి అడ్డు గీతలు ఉండకూడదని ఆయన అభిప్రాయంం వ్యక్తం చేశారు.
దేశంలో ఒకప్పుడు కాంగ్రెస్ ఏక పార్టీగా చలామణి అయిందన్నారు. ఇప్పుడు బీజేపీ కూడా అదే బాటలో నడుస్తోందన్నారు. దేశంలో 1947నుంచి1952 మధ్య కాలంలో కొన్ని విపత్కర పరిస్థితులు చోటుచేసుకున్నాయన్నారు.
గడిచిన ఐదేండ్లలో మళ్లీ అలాంటి మార్పులనే మళ్లీ చూస్తున్నామన్నారు. ఒక సామాజిక శాస్త్ర విద్యార్థిగా చిప్కో ఉద్యమం, ఆదివాసీ జీవితాలపై పరిశోధనా రచనలు చేస్తూనే, భారతదేశ సమకాలీన చరిత్ర రచయితగా తాను ఎలా మారారో రామచంద్ర గుహ వివరించారు.
చరిత్రకారులు నిష్పక్ష పాతంగా వ్యవహరించాలన్నారు. కానీ వారు ఏదో ఒకవైపు పక్షపాతం వహిస్తున్నట్టు బయటివాళ్లకు అనిపించడం కూడా సహజమని వివరించారు. ఈ మధ్యకాలంలో శాస్త్ర, సాంకేతిక తదితర రంగాలపై సమకాలీన చరిత్ర రచనలు కొన్ని వస్తుండటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
‘ఇండియా ఆఫ్టర్ గాంధీ’ రచన క్రమంలో తాను సమస్యలను ఎదుర్కొన్నట్టు తెలిపారు. నెహ్రూ, ఇందిరాగాంధీకి సంబంధించిన చారిత్రక పత్రాలు, దస్తావేజులను వారి కుటుంబమే బయటపెట్టలేదన్నారు. అప్పుడు తాను గాంధీ కుటుంబానికి సన్నిహితంగా మెలిగిన రాజాజీ వంటి ఒకరిద్దరి ఆత్మకథారచనలద్వారా తనకు కావాల్సిన సమాచారాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు.