మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తమిళనాడులోని ఓ గ్రామం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తమిళనాడులోని ఉతిర్మెరూర్‌లో 12 వందల ఏండ్ల నాటి ఒక శిలాశాసనం ఉందన్నారు. అది యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోందన్నారు.
ఆ శిలాశాసనం ఓ చిన్న రాజ్యాంగం లాంటిదని ఆయన పేర్కొన్నారు. గ్రామసభను నడిపే విధానం, సభ్యులను ఎన్నుకునే విధానం గురించి ఆ శిలాశాసనంలో స్పష్టంగా వివరించారని తెలిపారు. మన దేశ చరిత్రలో ప్రజాస్వామ్య విలువలకు 12వ శతాబ్దపు బసవేశ్వరుడి అనుభవ మండపం ఓ చక్కని ఉదాహరణ అని పేర్కొన్నారు.
అక్కడ స్వేచ్ఛా వాదనలకు, చర్చలకు ప్రోత్సాహం లభించేదని ఆయన వెల్లడించారు. ఆ శిలాశాసనం మాగ్నా కార్టా ముందు కాలం నాటిదని ఆయన వివరించారు. 800 ఏండ్ల నాడు మాగ్నా కార్టా ఆవిర్భావంతో ప్రజాస్వామ్యం పురుడు పోసుకోవడం ఒక చారిత్రాత్మక ఘటన అని ఆయన అన్నారు.
అప్పట్లో రాజులకు సర్వాధికారాలు వుండేవి. బ్రిటన్ రాచరికంలో చక్రవర్తులను దైవాంశ సంభూతులుగా పేర్కొనేవారు. వారు ప్రజలపై నిరంకుశత్వాన్ని రుద్దారు. కానీ రాజు అయినంత మాత్రాన చట్టానికి అతీతుడు కాదని, రాజైనప్పటికీ చట్టపరమైన పాలనకు లోబడి ఉండాల్సిందేనని పేర్కొంటు రూపొందించిన తొలి హక్కుల పత్రమే మాగ్నా కార్టా. ఈ పత్రంపై 1215లో బ్రిటన్ రాజు జాన్ సంతకం చేయడంతో ప్రజాస్వామ్యం పురుడు పోసుకుంది.