– త్రిపుర అంటే ఒకప్పుడు హింస గుర్తుకు వచ్చేది
-ఇప్పుడు రాష్ట్రం అంతర్జాతీయ స్థాయిలో ఎదుగుతోంది
– డొనేషన్ కల్చర్ పోయింది
– ప్రజలను బెదిరింపుల నుంచి విముక్తి చేశాం
-మరోసారి డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలంటున్నారు
– అంబాస సభలో ప్రధాని మోడీ
త్రిపుర ప్రజలను భయం, బెదిరింపు, హింసల నుంచి బీజేపీ విముక్తి కల్పించిందని ప్రధాని మోడీ అన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వేగవంతమైన అభివృద్దిని చేస్తోందని ఆయన పేర్కొన్నారు. డొనేషన్ కల్చర్(విరాళాల సంస్కృతి) నుంచి త్రిపుర ప్రజల్ని విముక్తుల్ని చేసిందన్నారు.
త్రిపురాలోని అంబాసలో ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దశాబ్దాల కాంగ్రెస్, వామపక్షాల పాలన రాష్ట్రంలో అభివృద్దిని అడ్డుకుందని ఆయన ఆరోపించారు.
త్రిపుర అంటే ఒకప్పుడు హింస గుర్తుకు వచ్చేదన్నారు. గతంలో సీపీఎం కార్యకర్తలు పోలీసు స్టేషన్లను కూడా స్వాధీనం చేసుకునే వారన్నారు. కానీ బీజేపీ వచ్చాక ఆ సంస్కృతి పోయిందన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో మహిళ సాధికారత ఉందన్నారు. హీరా మోడల్ లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం పగలు రాత్రి కష్టపడి పని చేస్తోందన్నారు.
త్రిపురలో 5వేల కిలోమీటర్ల రోడ్లను నిర్మించామన్నారు. నూతన విమానాశ్రయాన్ని కూడా నిర్మించామన్నారు. అప్టికల్ ఫైబర్, 4జీ కనెక్టివిటీ తీసుకు వచ్చామన్నారు. ఇప్పుడు త్రిపుర అంతర్జాతీయ స్థాయిలో ఎదుగుతోందన్నారు. ఈ సంతోషం, ఉత్సాహం నిజంగా ఈ అభివృద్ధి డబుల్ ఇంజిన్ అస్సలు ఆగదని చెబుతున్నాయన్నారు.
అన్ని దిశల నుండి ‘ఫిర్ ఏక్ బార్, డబుల్ ఇంజన్ కి సర్కార్’అని బలంగా వినిపిస్తోందన్నారు. తాము ఈశాన్య రాష్ట్రాలు, త్రిపురను ఓడరేవులతో అనుసంధానించడానికి జలమార్గాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. పేదలకు ద్రోహం చేయడం కాంగ్రెస్, వామపక్షాలకు మాత్రమే తెలుసు.
వారు పేదలను ఏ ఆందోళన నుండి ఎప్పటికీ విముక్తి చేయలేరన్నారు. బీజేపీ మీ సేవకుడిగా, మీకు నిజమైన తోడుగా మీ ప్రతి ఆందోళనను తొలగించేందుకు పగలు రాత్రి కష్టపడుతోందన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్-లెఫ్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇక్కడ సీపీఎం అధికారంలో ఉన్నప్పుడు గిరిజనుల్లో కూడా చీలికలు సృష్టించారన్నారు. ఈ పార్టీలు సమాజంలో పరస్పర వివాదాలను ప్రోత్సహించాయని ఫైర్ అయ్యారు.