సమాజ్ వాదీ పార్టీ కేవలం కుటుంబం కోసం పనిచేసే పరవార్ వాదీ అని ఆరోపించారు ప్రధాని మోడీ. యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 23 నియోజకవర్గాల ప్రజలు, కార్యకర్తలతో ఒకేసారి వర్చువల్ లో ప్రసంగించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను బీజేపీ నేతలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మోడీ. ఆపార్టీ నేతలను గెలిపిస్తే రైతులను పస్తులు పెడతారని విమర్శించారు.
యూపీలో బీజేపీ సర్కార్ వచ్చాక గూండాలు, మాఫియాను తరిమికొట్టిందని గుర్తు చేశారు మోడీ. రాష్ట్రం శాంతియుతంగా ఉండాలంటే ఎవరిని గెలిపించాలో ప్రజలు ఆలోచించాలని సూచించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వల్ల కోవిడ్ టీకా పంపిణీలో ఉత్తరప్రదేశ్ వాసులు ఎంతో ప్రయోజనం పొందారని తెలిపారు. ఓటు వేసేటప్పుడు ప్రజలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని.. కుటుంబ రాజకీయాలు చేసే ఎస్పీకి అవకాశం ఇవ్వొద్దని కోరారు.
సమాజ్ వాదీ పార్టీలో క్రిమినల్స్ ఉన్నారని.. మాఫియా వాళ్లకు ఆ పార్టీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిందని ఆరోపించారు మోడీ. ఆ మాఫియావాదులకు అధికారం ఇస్తే రాష్ట్రంలో సంక్షేమ పథకాలను నిలిపేస్తారని చెప్పారు. రైతులకు కేంద్రం ఏటా డిపాజిట్ చేస్తున్న రూ.6 వేలను కూడా అడ్డుకుంటారని అన్నారు. గత ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయలేకపోయాయని ఆరోపించారు.
యూపీలో మొత్తం 7 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 10న మొదటిదశ పోలింగ్ నిర్వహించనున్నారు అధికారులు. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి.