కేంద్రంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిప్పులు చెరిగారు. రాడికలిజం, ద్వేషం, విభజన వాదాలు దేశ పునాదులను కుదిపివేస్తున్నాయని ఆమె అన్నారు. తద్వారా సమాజానికి నష్టం కలిగిస్తున్నాయని తెలిపారు. ద్వేషం, అసహనం, మతోన్మాదాలు దేశాన్ని చుట్టుమడుతున్నాయని ధ్వజమెత్తారు.
వీటికి వెంటనే పుల్ స్టాప్ పెట్టక పోతే పునర్నిర్మించలేని స్థితిలోకి సమాజం వెల్లిపోతుందన్నారు. ఇలాంటి పరిస్థితులు కొనసాగేందుకు దేశ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని ఓ పత్రికా సంపాదకీయంలో పేర్కొన్నారు. విద్వేషపూరిత ప్రసంగాలకు వ్యతిరేకంగా నిలబడకుండా ప్రధాని మోడీ ఏ శక్తి అడ్డుకుందని ఆమె ప్రశ్నించారు.
ఉమ్మడిగా పండుగలు జరుపుకోవడం, విభిన్న విశ్వాసాలకు చెందిన వర్గాల మధ్య మంచి పొరుగు సంబంధాలు ఇవన్నీ చాలా కాలంగా మన సమాజంలో కొనసాగుతున్నాయన్నారు. అవి మనకు గర్వకారణం అన్నారు. కానీ సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని బలహీనపరచడం అంటే భారతీయ సమాజం, జాతీయతల సమన్వయ పునాదిని దెబ్బతీయడమేనన్నారు.
శ్రీ రామనవమి సందర్భంగా దేశంలో అనేక చోట్ల మత ఘర్షణలు, హిజాబ్, అజాన్‌లకు సంబంధించిన వివాదం నేపథ్యంలో సోనియా గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదంతా దేశాన్ని శాశ్వత ఉన్మాద స్థితిలో ఉంచడానికి చేస్తున్న విభజన ప్రణాళికలో భాగమన్నారు. అధికారంలో ఉన్నవారి భావజాలానికి వ్యతిరేకంగా ఉన్న అన్ని భిన్నాభిప్రాయాలను వారు నిర్దాక్షణ్యంగా లణిచి వేస్తున్నట్టు ఆమె చెప్పారు.