2020లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు వచ్చినప్పుడు ఆయన పర్యటన నిమిత్తం కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ. 38 లక్షలు ఖర్చు చేసినట్టు సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ద్వారా తెలిసింది. ఆయన 36 గంటల పర్యటనపై ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఖర్చు చేసింది.
ట్రంప్ వసతి, ఆహారం, ఇతర అవసరాలపై ఈ మొత్తాన్ని వాడింది. 2020 ఫిబ్రవరి 24-25న ట్రంప్ తన భార్య మెలానియా, కూతురు ఇవాంకా, అల్లుడు జరేడ్ కుష్నర్, పలువులు అమెరికా అధికారులతో గుజరాత్ లోని అహ్మదాబాద్, దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించారు.
అహ్మదాబాద్ లో ఫిబ్రవరి 24న ట్రంప్ మూడు గంటలు గడిపారు. అక్కడి నుంచి ట్రంప్ తాజ్ మహల్ ను చూసేందుకు ఆగ్రాకు వెళ్లారు. అనంతరం ఫిబ్రవరి 25న ఢిల్లీలో పర్యటించిన ఆయన ప్రధాని మోడీతో చర్చలు జరిపారు. అయితే భారత్ పర్యటనలో ఉన్న ట్రంప్ కోసం కేంద్ర సర్కార్ ఎంత ఖర్చు చేసిందనే విషయంపై సమాచార హక్కు చట్టం కింద మిషాల్ భతేనా అనే వ్యక్తి వివరాలు కోరారు.
దానికి కేంద్ర విదేశాంగ శాఖ తాజాగా సమాధానం ఇచ్చింది. 2020, అక్టోబరు 24న భతేనా మొదట ఈ సమాచారాన్ని ఆర్టీఏ ద్వారా కోరారు. కానీ దానికి సమాధానం అందలేదు. దీంతో ఆయన సమాచార కమిషన్ ను ఆయన ఆశ్రయించారు. కరోనా నేపథ్యంలో సమాచారం అందించడం ఆలస్యమైందని కేంద్రం చెప్పింది.