ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వందే భారత్ రైలును ఆదివారం వర్చువల్ గా ప్రారంభిస్తారని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సంబంధించి సీఎం సహా పలువురికి ఆహ్వానం పంపినట్లు చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మోడీ సర్కారు పనిచేస్తోందన్నారు. ప్రజారోగ్యానికి కేంద్రం పెద్దపీట వేస్తోందని కిషన్ రెడ్డి చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా లక్షా 50వేల వెల్ నెస్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు.
వెల్ నెస్ సెంటర్లలో అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. గతంలో దేశవ్యాప్తంగా 387 మెడికల్ కాలేజీలు ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 606కు పెరిగిందని, 7 ఎయిమ్స్ హాస్పిటళ్ల స్థానంలో ఇప్పుడు 22కు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. 2024లో మరో 9 ఎయిమ్స్ ఆస్పత్రులు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.
ఇందులో భాగంగానే ప్రతి నెలా లక్ష ఉద్యోగాల భర్తీ కోసం మూడో వారంలో ఉద్యోగ ప్రకటనలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు దఫాలుగా ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్పిన ఆయన.. ఈ నెల 20న మరికొందరికి అపాయింట్ మెంట్ లెటర్లు అందజేస్తామని పేర్కొన్నారు.
అనంతరం కేసీఆర్, కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కిషన్ రెడ్డి. తండ్రిని, కుటుంబాన్ని అడ్డుపెట్టుకుని కేటీఆర్ లా మంత్రి కాలేదని, కష్టపడి పైకి వచ్చామన్నారు. బీఆర్ఎస్ నేతలు మిడి మిడి జ్ఞానంతో.. తప్పుడు ఆలోచనతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. తాలిబాన్ రాజ్యం అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను దేశ పౌరులు ఖండించాలని పిలుపునిచ్చారు. దేశం ఇమేజ్ తగ్గించే విధంగా కల్వకుంట్ల కుటుంబం మాట్లాడుతోందని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థను పాకిస్థాన్, శ్రీలంకలతో పోలుస్తున్నారని.. ఇదేనా దేశానికి ఇచ్చే గౌరవం అంటూ ప్రశ్నించారు కిషన్ రెడ్డి.