దేశ అభివృద్ధికి మోడీ సర్కార్ కట్టుబడి ఉందని, వివిక్ష పూరిత రాజకీయాలకు తమ ప్రభుత్వం దూరంగా ఉంటుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. పార్టీ ప్రాముఖ్యతలు, విధానాలు, దేశంలో మతఘర్షణలు సహా పలు అంశాలపై ఆయన మాట్లాడారు.
బీజేపీ గురించి తెలుసుకోండి (నౌ బీజేపీ) కార్యక్రమాన్ని పార్టీ ఇటీవల నిర్వహించింది. దీనికి పలు దేశాల దౌత్యవేత్తలు హాజరయ్యారు. ఐరోపా దౌత్యవేత్తలు సహా పలువురు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు.
‘ మేము బీజేపీ నాయకులను ఎన్నో ప్రశ్నలు అడగాలని అనుకున్నాము. అందుకోసం సరైన అవకాశం ఇప్పుడు దొరికింది. ఇక్కడ తెలుసుకున్న విషయాలను మేము మా హెడ్ క్వార్టర్లకు పంపిస్తాము’ అని దౌత్యవేత్త ఒకరు తెలిపారు.
బీజేపీ, దాని సైద్దాంతిక గురువు ఆర్ఎస్ఎస్ ల మధ్య సంబంధం గురించి మరింత తెలుసుకోగలిగామని మరో దౌత్యవేత్త పేర్కొన్నారు. ఉమ్మడి పౌరస్మృతిపై నడ్డాను తాను ప్రశ్నించినట్టు, ఈ బిల్లును ముస్లిం వ్యతిరేక బిల్లుగా పలువురు అభివర్ణిస్తున్న విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించినట్టు చెప్పారు.
ఉమ్మడి పౌరస్మృతిపై దౌత్యవేత్తలు అడిన ప్రశ్నలకు నడ్డా సావధానంగా సమాధానం ఇచ్చారని, దానిపై వారి సందేహాలను నడ్డా నివృత్తి చేశారని బీజేపీ విదేశీ వ్యవహారాల శాఖ ఇంఛార్జ్ చౌతాయి వాలే వివరించారు.
సబ్ కా సాత్- సబ్ కా వికాస్ తమ ఎజెండా అని దౌత్యవేత్తలకు నడ్డాజీ తెలిపినట్టు ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి పథకాల్లో తమ ప్రభుత్వం ఎలాంటి వివక్షతనూ చూపించడం లేదన్న విషయాన్ని విదేశీ రాయభారులకు నడ్డా జీ విస్పష్టంగా వివరించినట్టు చౌతాయి వాలే పేర్కొన్నారు.