హైదరాబాద్: కొత్త గవర్నర్ల నియామకంలో మోడీ తన మార్క్‌ను చూపించారు. సీనియర్ నేత దత్తాత్రేయను హిమాచల్‌ప్రదేశ్‌కు గవర్నర్‌గా నియమించి పార్టీపరంగా తగినంత గౌరవం ఇచ్చారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మరో సీనియర్ నేత విద్యాసాగర్‌రావుకు పొడిగింపు ఇవ్వకపోవడం, రాజీవ్‌గాంధీ క్యాబినెట్‌లో కేంద్ర మంత్రిగా పనిచేసిన అరిఫ్‌ఖాన్‌ను గవర్నర్‌గా నియమించడం మాత్రం ఆశ్చర్యం కలిగించింది. కేంద్ర మంత్రిగా పనిచేసి, బీజేపీ జాతీయ నేతలతో దగ్గర సంబంధాలు ఉన్న విద్యాసాగర్‌రావును రీజనేంటని తెలంగాణలో ప్రస్తుతం పెద్ద చర్చ జరుగుతోంది. విద్యాసాగరరావుని కొనసాగించకపోవడానికి ఊహకు అందని బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని అనుకుంటున్న బీజేపీ పెద్దలు ఏ చిన్న విషయాన్ని కూడా వదలడం లేదు. విద్యాసాగర్‌రావు పదవీ కాలాన్ని పొదగించకపోవడానికి ఆయనకు కొడుకు వరుసయ్యే ప్రద్యుమ్నారావు ఒక కారణంగా కనిపిస్తుంది. ప్రద్యుమ్నారావు రాష్ట్రంలో టీఆర్ఎస్ పెద్దలతో పాటు మేఘ కృష్ణారెడ్డి, మైహోమ్ రామేశ్వర్‌రావులతో సన్నిహితంగా ఉంటారు. విద్యాసాగర్‌రావు పరపతిని ఉపయోగించుకొని వేరే రాష్ట్రాల్లో మేఘ కృష్ణారెడ్డికి, మైహోమ్ రామేశ్వర్‌రావుకు పనులు చక్కబెట్టేవారు. తాము టీఆర్ఎస్‌పై కొట్లాడుతుంటే మరోపక్క విద్యాసాగర్‌రావు ఇండైరెక్ట్‌గా వాళ్లకు ఉపయోగపడుతున్నారని రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పటికే చాలాసార్లు కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లారు, అవన్నీ విని ఊరుకున్న బీజేపీ పెద్దలు ఇప్పుడు సమయం చూసి విద్యాసాగర్‌రావును పక్కన పెట్టారని ఆ పార్టీ రాష్ట్ర నేతలు చెప్పుకుంటున్నారు.
ఇక అరిఫ్ మహ్మద్‌ఖాన్‌ను గవర్నర్‌గా నియమించడానికి కూడా పెద్ద కారణమే ఉందని అంటున్నాయి బీజేపీ వర్గాలు. అరిఫ్ ఖాన్ రాజీవ్‌గాంధీ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు, దశాబ్దకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అరిఫ్‌ఖాన్‌ను గవర్నర్‌గా నియమించడానికి రెండు కారణాలు ఉన్నాయి అంటున్నారు బీజేపీ నేతలు. అరిఫ్‌ఖాన్ 1986లో కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నప్పుడు షన్ భానో కేసులో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీకి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో మాట్లాడారు, ముస్లిం చట్టాలలో మార్పుల కోసం పోరాడారు. భార్యకు తలాక్ చెప్పిన తరువాత భరణం ఇవ్వాలి అని షన్ భానో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో ముస్లిం పెద్దలు తీవ్రంగా వ్యతిరేకించారు. దాంతో ప్రధాని రాజీవ్‌గాంధీ ముస్లిం పెద్దలకు మద్దతు తెలపడంతో దాన్ని విభేదిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు అరిఫ్ ఖాన్, దాంతో అరిఫ్‌ఖాన్‌పై సెక్యులర్ ముస్లిం అనే ముద్ర పడింది. ఈమధ్య కాలంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ట్రిపుల్ తలక్ బిల్‌కు అరిఫ్‌ఖాన్ మద్దతు తెలిపారు, ముస్లిం మహిళల హక్కుల కోసం పోరాడుతున్న అరిఫ్ మహ్మద్ ఖాన్‌ను బీజేపీ ప్రభుత్వం గవర్నర్‌గా నియమించి గౌరవించింది అంటున్నారు బీజేపీ నేతలు. మోడీ-షా ద్వయం ఏది చేసినా రాజకీయ లాభనష్టాలు బేరీజు వేసుకుంటారు. విద్యాసాగర్‌రావును కొనసాగిస్తే రాష్ట్ర బీజేపీకి ఇబ్బంది అని కొనసాగింపు ఇవ్వలేదు, అరిఫ్‌ఖాన్‌ను గవర్నర్‌గా నియమించి మైనార్టీ వర్గాలకు దగ్గరవ్వొచ్చు అని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.