మోడీ సర్కార్ పై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ కుటుంబాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని మోడీ సర్కార్ టార్గెట్ చేసుకుందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఆరోపణలు గుప్పించారు.
బీజేపీ ఎంపీ పర్వేజ్ సాహిబ్ సింగ్ వర్మ వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. దేశంలోని ముస్లింలను ఆర్థికంగా వెలివేయాలని బీజేపీ ఎంపీలు పిలుపునిస్తున్నారంటూ ఆయన పేర్కొన్నారు. ముస్లింలను ఎదుర్కొనేందుకు హిందువులు తమ ఇండ్లల్లో ఆయుధాలు పెట్టుకోవాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారన్నారు.
కవిత ఈడీ దాడుల నేపథ్యంలో ఆయన స్పందిస్తూ.. బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ సర్కార్ ను, కేసీఆర్ కుటుంబాన్ని కక్ష్య సాధింపుల ఉద్దేశంతోనే ఇబ్బంది పెడుతోందన్నారు.
మరోవైపు సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత ఈ రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఉదయం 11గంటలకు ఏపీజే అబ్దుల్ కలామ్ రోడ్డులో వున్న ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఈ క్రమంలో ఈడీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.