నర్సింహా రెడ్డి
జర్నలిస్ట్
కరోనా మాటున ప్రైవేటీకరణను మోడి సర్కార్ వేగవంతం చేసింది. బుల్లెట్ రైలు రాలేదు కాని అంతకు మించి యమ మాంచి స్పీడ్ తో ప్రైవేటీకరణ జరుగుతోంది. మోడి గద్దేనెక్కిన తర్వాత సరళీకరణ ఆర్దిక విధానాల్లో భాగంగా సంస్కరణల పేర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు శక్తులకు దారదత్తం చేస్తున్నారు. నష్టాల నివారణ, సమర్ధత, పోటి తత్వం పెంపు వంటి కారణాలు చూపుతు..రక్షణతో సహా అన్ని రంగాలను ప్రైవేటు వ్యక్తులకు, తన అనుయాయులకు కట్టబెడుతున్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలే ఈ దేశ సంపద. వేల కోట్ల వనరుల ఈ సంస్ధలు మన సంక్షేమానికి దిక్సూచిలు. రక్షణ, రైల్వేలు, టెలికాం, పౌర విమానయన, అంతరిక్షం, శాటి లైట్స్, ఇంధనం, పెట్రోలియం, మైనింగ్, బొగ్గు వంటి వ్యూహత్మక రంగాల్లో వంద శాతం విదేశీ పెట్టుబడులకు బాటలు వేస్తు జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. వంద శాతం విదేశీ పెట్టుబడులు వస్తే..జాతి ప్రయోజనాలకు, జాతి భద్రతకు భంగం కలగడం ఖాయం. సరళీకరణ ఆర్దిక విధానాలు మొదలైన 1991 నుంచి ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరిస్తూ ప్రభుత్వ పాత్రను తగ్గిస్తూ వస్తున్నారు. కాని ఈ తప్పిదాలను ప్రశ్నిస్తూ అధికారంలోకి వచ్చిన మోడి..ఎవరు చేయనంత వేగంగా ప్రైవేటు పరం చేసి పారేస్తున్నారు. స్వావలంభన, ఆర్దిక సార్వభౌమత్వం, సామాజిక న్యాయం వంటి విధానాలకు స్వస్తి పలుకుతున్నారు. అటల్ బిహరీ వాజ్ పేయి హయంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ కోసం ఏకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసారు. డిసిన్వెస్ట్మెంట్ కోసం అరుణ్ శౌరిని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. అయితే ఆ ప్రయోగంతో వాజ్ పాయి సర్కార్ కు చెడ్డ పేరు రావడం, ఆ తర్వాత ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించడం జరిగాయి. అయితే ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోలేక పది సంవత్సరాల్లోనే చిత్తుగా ఓడింది. మోడి ప్రచారాన్ని నమ్మిన ప్రజలు ఆయన్ను అందల మెక్కించారు. అయితే మోడి చేస్తున్నందేంటి అంటే …ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉప సంహరణకు అరుణ్ శౌరి స్థానంలో మరరొకరిని తెచ్చి పెట్టారు. డిసిన్వెస్ట్మెంట్ కోసం ఏకంగా ఒక సంస్థనే ఏర్పాటు చేసారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ వాటా అమ్మకం కోసం నీతి ఆయోగ్ ను ఏర్పాటు చేసి బాద్యతలను అప్పజెప్పారు. దీంతో 74 సంస్థలను గుర్తించి నీతి అయోగ్ ఇందులో 26 సంస్థలను మూసి వేయాలని, మిగిలిన వాటిలో ప్రభుత్వ వాటాలను విక్రయించాలని సిఫార్సు చేసింది. సిఫార్సులను ఆమోదించిన మోడి సర్కార్….క్రమంగా వాటాలను విక్రయించుకుంటూ పోతుంది. అయితే దానికి వ్యూహత్మక భాగస్వామ్యం అనే చక్కటి పేరు పెట్టి..ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతోంది. ముఖేష్ అంబానికి చెందిన రిలయన్స్ మ్యుచువల్ ఫండ్ మేనేజర్లను ప్రభుత్వం కన్స్ ల్టెంట్లుగా నియమించుకుని..అమ్మకాలను వేగవంతం చేసింది. దేశ ఆర్దిక పరిపుష్టికి, ఉపాధికి వెన్నెముకగా నిలిచే ONGC,గేయిల్, అయిల్ ఇండియా లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, కోల్ ఇండియా లిమిటెడ్, BHEL,భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను విక్రయానికి తలుపులు తెరిచింది. రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ సంస్థలను వదిలించుకుంటోంది. సెలం లోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, స్టీల్ ఆదారిటి ఆఫ్ ఇండియాకు చెందిన దుర్గాపూర్ , బద్రావతి ప్లాంట్లతో పాటు మినిరత్నాలుగా పేరున్న ఎన్నో సంస్థలను అమ్మేందుకు సిద్దపడింది. బీడీఎల్, మిధాని వంటి రక్షణ రంగ సంస్థల్లో మెజారిటి షేర్లను వదులుకునేందుకు సిద్దమైంది. ప్రభుత్వ రంగ సంస్థలైన 5 జాతీయ భీమా సంస్థలను దేశీయ, విదేశీ కంపెనీలను అమ్మకానికి పెట్టింది. నిజంగా ఈ కంపెనీలు దేశ ఆర్థిక వ్యవస్థలకు భారంగా మారాయా అంటే అది లేదు. ప్రభుత్వ ఖజానాకు పన్నులు, డివిడెంట్లు, ఇతర చెల్లింపుల ద్వారా ప్రతి ఏడాది కనీసం రెండు లక్షల కోట్ల ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నాయి. అయినా నష్టాల పేర జాతీ వారస్వత సంపదలను వేలం వేస్తున్నారు.
ప్రభుత్వ విధానాల వల్లే ఇది నష్టపోతున్నాయి తప్పితే ..సిబ్బంది వల్ల కానే కాదనేది అక్షర సత్యమని ఎన్నో సార్లు నిరుపితమైంది. PSU ల నుంచి లక్షల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతున్నప్పటికీ..వాటి ఆదునీకరణ కు ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. పైగా సంస్థల ఆర్దిక స్థోమతకు మించి డివిడెంట్ల రూపంలో ప్రభుత్వం వసూలు చేస్తూ…క్రమ పద్దతిలో వాటిని ఆర్ధిక ఊబిలోకి నెట్టేస్తున్నాయి. కారు చౌకగా వాటి ఆస్తులను అమ్మేయాలనే పన్నాగంతో …ఆయా సంస్థలను కోలుకోలేకుండా దెబ్బతీస్తున్నారు. అదే ప్రభుత్వ రంగ సంస్థలను కొనుగోలు చేస్తున్న సంస్థలు భాగున్నాయా అంటే అది లేదు. జాతీయ బ్యాంకులకు లక్షల కోట్లు బకాయిలు పడినవే. పైగా ప్రతి ఏడాది పన్నులు చెల్లించుకుండా ప్రభుత్వ ఖజానాకు 5 లక్షల కోట్ల రూపాయలకు పైగా గండికొడుతున్నాయి. అయినా పాలిచ్చే పాడి ఆవును అమ్మి..దున్నపోతును కొనుగోలు చేస్తున్న చందంగా…జాతి సంపదను ప్రైవేటు శక్తులకు దారదత్తం చేస్తున్నారు. మరో వైపు ఔషధ రంగాన్ని పూర్తిగా విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాసుటికల్స్ లిమిటెడ్, రాజస్థాన్ డ్రగ్స్ అండ్ ఫార్మాసుటికల్స్ లిమిటెడ్, హిందుస్థాన్ యాంటి బయోటిక్స్ లిమిటెడ్ (హాల్ ), బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మాసుటికల్స్ లిమిటెడ్ లను గుండు గుత్తగా అమ్మే పనిని మొదలు పెట్టింది. వేల కోట్ల ఆస్తులున్న ఈ సంస్థలకు ఏ కాస్త ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించినా..తిరిగి కోలుకుని జాతి రత్నాలుగా మెరుస్తాయి. కాని మేక్ ఇన్ ఇండియా అని నిత్యం చెప్పుకునే మోడి సర్కార్ కు మాత్రం ఆ పనిచేసేందుకు మనసొప్పడం లేదు. మరో వైపు జిందగీకే సాత్ బీ… జిందగీకే బాద్ బీ అని మనం సగర్వంగా చెప్పుకునే LIC, BSNL, ఇండియన్ రైల్వేలు, షిప్పింగ్ కార్పోరేషన్, ఎయిర్ ఇండియా వంటి సంస్థల్లో అమ్మకాలను మొదలు పెట్టింది. ఇవి చాలవన్నట్లు కరోనా సాకుతో ప్రైవేటీకరణను మరింత ఉధృతం చేసింది. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకంలో భాగంగా బొగ్గు, ఖనిజం, రక్షణ ఉత్పత్తులు, విమానాశ్రయాలు, ఏరో స్పేస్, స్పేస్, యూటీల్లోని డిస్కమ్, అణు విద్యుత్ శక్తి వంటి కీలక రంగాల్లో ప్రయివేటుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీంతో యూపీఏ ప్రభుత్వంపై ఇప్పటి ఉప రాష్ట్రపతి చేసిన వ్యాఖ్యానాలు గుర్తుకు వస్తున్నాయి. భూ గర్భంతో బొగ్గు మొదలుకుని..అంతరిక్షంలో అంత్రాక్స్ వరకు అంతా ప్రైవేటు పరం అని అప్పట్లో ఆయన ప్రసంగించేవారు. మోడి ప్రభుత్వంలో కూడా అదే జరుగుతుందనేది జగమెరిగిన సత్యం.