ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీని ఆ దేశ ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ ప్రశంసలతో ముంచెత్తేశారు. మోడీ ఎక్కడికి వెళ్లినా ఆయనకు ‘రాక్ స్టార్ ఘనస్వాగతం’ లభిస్తుందన్నారు. మోడీ ఈజ్ ది బాస్ అని అభివర్ణించారు. సిడ్నీలోని కుడోస్ బ్యాంక్ ఎరీనా ఇండోర్ స్టేడియంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ప్రవాస భారతీయులతో బాటు పెద్ద సంఖ్యలో హాజరైన ఆస్ట్రేలియన్లు… మోడీకి ఘన స్వాగతం పలికారు. వీరిని ఉద్దేశించి ప్రసంగించేందుకు మోడీ ముందుకు రాగానే అల్బనీస్ ఆయనను హగ్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. గతంలో తాను ఈ స్టేడియం కి అమెరికన్ సింగర్ బ్రూస్ స్ప్రింగ్ స్టీన్ తో కలిసి వచ్చినప్పుడు అతనికి లభించిన స్వాగతం కన్నా ఇప్పుడు మోడీకి ఇంత ఘనంగా వెల్కమ్ లభించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అందుకే ఈయనను ‘బాస్’ అంటున్నానన్నారు. మోడీ నాయకత్వంలో ఇండియా తమ దేశాన్ని పటిష్టంగా మారుస్తోందని ఆయన చెప్పారు.
భారత్ తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోదలచుకుంటున్నామన్నారు.’ గతంలో నేను ఇండియాకు వచ్చినప్పుడు నాకు కలిగిన మధుర మైన అనుభూతులు అన్నీఇన్నీ కావు.. గుజరాత్ లో హొలీ వేడుకల్లో పాల్గొన్నా. ఢిల్లీలో మహాత్మా గాంధీ సమాధిపై పుష్ప గుఛ్చాలను ఉంచా.. అహ్మదాబాద్ లోని స్టేడియంలో ఆసీస్-ఇండియా మధ్య జరిగిన నాలుగో మ్యాచ్ చూశా’ అని ఆయన ఆ స్మృతులను గుర్తు చేసుకున్నారు.
ఇక మోడీ .. క్రికెట్, ‘మాస్టర్ షెఫ్’ భారత ఆస్ట్రేలియా దేశాల మధ్య బాండ్ ను ఏకం చేసినట్టు పేర్కొన్నారు. ఇప్పుడు యోగా కూడా మన దేశాలను మరింత సన్నిహితం చేసిందన్నారు. లోగడ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలను కామన్ వెల్త్, క్రికెట్, కర్రీ గా అభివర్ణించేవారని, కానీ ఇప్పడు ఈ సంబంధాలను డెమోక్రసీ, డయాస్పోరా, దోస్తీ అని పేర్కొనవచ్చునన్నారు. ఇదే సమయంలో ఎనర్జీ, ఎకానమీ, ఎడ్యుకేషన్ రంగాలు కూడా ఉభయ దేశాలను కలుపుతున్నాయన్నారు.