కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ నకిలీ ఎన్ కౌంటర్ కేసులో యూపీఏ ప్రభుత్వ హయాంలో సీబీఐ తనను చాలా ఇబ్బంది పెట్టిందన్నారు. ఈ కేసులో బలవంతంగా ప్రధాని మోడీ(అప్పటి గుజరాత్ సీఎం)ను ఇరికించాలని తనపై విచారణ సమయంలో సీబీఐ ఒత్తిడి తెచ్చిందన్నారు.
ఓ ఆంగ్ల ఛానెల్ నిర్వహించిన రైజింగ్ ఇండియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ పై సూరత్ కోర్టు తీర్పు విషయంపై అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. దేశంలో కోర్టు ద్వారా శిక్ష పడి శాసన సభ్యత్వం కోల్పోయిన వ్యక్తి కేవలం ఒక రాహుల్ గాంధీ మాత్రమే కాదన్నారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలను గత ప్రభుత్వాలు ఎలా దుర్వినియోగం చేశాయో తాను చెబుతానన్నారు. తాను కూడా ఒక బాధితున్ని అని చెప్పారు. కాంగ్రెస్ తమపై అవినీతి కేసు పెట్టలేదన్నారు. తాను గుజరాత్ హోం మంత్రిగా ఉన్న సమయంలో ఓ ఎన్ కౌంటర్ జరిగిందన్నారు.
అప్పుడు తనపై కేసు నమోదు చేసి సీబీఐ అరెస్టు చేసిందన్నారు. విచారణ సమయంలో ఎందుకు భయపడుతున్నారంటూ సీబీఐ అధికారులు తనను అడిగారన్నారు. ఈ కేసులో మోడీ పేరును ఇరికిస్తే తనను వదిలేస్తామని అన్నారని ఆయన చెప్పారు.
అప్పుడు కూడా తాము నిరసనలు చేయలేదన్నారు. ఇలా నల్ల బట్టులు వేసుకుని, పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకోలేదన్నారు. మోడీకి వ్యతిరేకంగా సిట్ ను ఏర్పాటు చేస్తే దాన్ని సుప్రీం కోర్టు రద్దు చేసిందన్నారు. అనర్హత విషయంలో రాహుల్ గాంధీ ఉన్నత న్యాయస్థానానికి వెళ్లకుండా మోడీని నిందిస్తున్నారంటూ మండిపడ్డారు.
రాహుల్ గాంధీ పూర్తి ప్రసంగాన్ని వినండన్నారు. ప్రధాని మోడీ జీని దూషించడమే కాదు, మొత్తం మోడీ కమ్యూనిటీ, ఓబీసీ సమాజాన్ని దూషించే మాటలు రాహుల్ గాంధీ మాట్లాడాడన్నారు.