ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ లో మాట్లాడారు. ఉక్రెయిన్ పై రష్యా దాడుల నేపథ్యంలో ఆ దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి ఆయన చర్చించారు. అలాగే అక్కడ చిక్కుకున్న భారతీయులు, వారి తరలింపు గురించి మాట్లాడారు. ఉద్రిక్తతల తగ్గింపునకు సంబంధించి రష్యాతో ఉక్రెయిన్ కొనసాగిస్తున్న చర్చల పట్ల మోడీ హర్షం వ్యక్తం చేశారు.
ఆ విషయంలో జెలెన్స్కీని అభినందించారు మోడీ. ఉక్రెయిన్ లోని భారతీయులను స్వదేశానికి పంపడంలో జెలెన్స్కీ ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి మోడీ ధన్యవాదాలు తెలిపారు. దాదాపు 35 నిమిషాల పాటు జెలెన్స్కీ, మోడీ మధ్య చర్చలు జరిగినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల తెలిపాయి.
రష్యా యుద్ధంతో అతలాకుతలమవుతోన్న ఉక్రెయిన్ ను ఆర్థికంగా ఆదుకోవడం కోసం బ్రిటన్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆ దేశానికి 100 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది. ఉక్రెయినియన్ల సంక్షేమం, ఉద్యోగుల జీతాలు తదితర ఖర్చులకు ఈ నిధులు ఉపయోగపడుతాయని యూకే ప్రభుత్వం వెల్లడించింది.
ఐరోపాలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రమైన జపోరిషియా నూక్లియర్ ప్లాంట్ ను రష్యా సేనలు అధీనంలోకి తీసుకున్నాయి. ప్రస్తుతం అక్కడ మొబైల్, ఇంటర్నెట్ సేవలను రష్యా బలగాలు నిలిపివేశాయి. ప్లాంట్ నుంచి ఎటువంటి సమాచారం బయటకు రావొద్దనే ఉద్దేశంతోనే ఈ సేవలను నిలిపివేసి ఉంటారని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఓ ప్రకటనలో పేర్కొంది.