భారత ప్రధాని నరేంద్ర మోడీ 1993లో దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మోడీ యూరప్ పర్యటన సందర్భంగా జర్మనీలో క్లిక్ చేసిన ఓ పాత ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో మోడీ నీలిరంగు విండ్ బ్రేకర్, లోపల తెల్ల చొక్కా, ఫ్యాంట్ ధరించి ఓ మిత్రుడుతో కలసి ఉన్నారు.
మోడీ యూఎస్ పర్యటన నుంచి తిరిగి వస్తున్నప్పుడు జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో.. పవిత్ర రోమన్ సామ్రాజ్యాన్ని స్థాపించిన పశ్చిమ యూరోప్‌కు చెందిన మధ్య యుగ చక్రవర్తి చార్లీ మాగ్నా విగ్రహం వద్ద మోడీ, తన మిత్రుడితో కలిసి ఫోటో దిగారు.
మోడీ గుజరాత్ సీఎం కాకముందు.. పార్టీలో క్రియాశీల కార్యకర్తగా ఉన్న సమయంలో దిగిన ఆ ఫోటో.. ఇప్పుడు ప్రధాని హోదాలో జర్మనీలో పర్యటిస్తున్న సందర్భంగా ఒక్కసారిగా ఫేమస్ అయింది. అది చూసిన నెటిజన్లు అప్పటికీ.. ఇప్పటికీ మోడీలో కలిగిన మార్పులను గమనిస్తున్నామని కామెంట్లు పెడుతున్నారు.
ప్రస్తుతం ప్రధానిమోడీ మూడు రోజుల యూరప్ పర్యటనలో ఉన్నారు. మే రెండో తేదీన జర్మనీలో పర్యటించిన ఆయన జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్‌ను కలిశారు. తర్వాత డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్‌సెన్ ను కలిశారు. తన పర్యటనలో భాగంగా చివరి రోజున కొత్తగా తిరిగి ఎన్నికైన అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ను కలవడానికి పారిస్‌కు వెళ్లనున్నారు. దానికంటే ముందు డెన్మార్క్‌లో జరిగే రెండవ ఇండియా నార్డిక్ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారు.