దేశంలో పెరిగిపోతున్న జనాభా పై విశ్వహిందూ పరిషద్ మాజీ నేత ప్రవీణ్ తొగాడియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీన్నిఆయన ‘టైం బాంబు’తో పోల్చారు. ఇది ‘పేలిపోకుండా’ చూసేందుకు అత్యవసరంగా చట్టాన్ని రూపొందించవలసిన అవసరం ఉందని, లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా.. 2024 ఎన్నికలకు ముందే ఓ చట్టం తేవచ్చునని, అదే సమయంలో ఉమ్మడి పౌర స్మృతిని కూడా అమల్లోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
జనాభా పెరుగుదల, ప్రజల్లో అసమానతలు ఒకవిధంగా ‘టైం బాంబు’ వంటివేనని, ఇవి పేలిపోతే నగరాలు, గ్రామాల్లో అంతర్యుధ్ధాలకు దారితీస్తుందని అంతర్ రాష్ట్రీయ హిందూ పరిషద్ అధ్యక్షుడు కూడా అయిన తొగాడియా పేర్కొన్నారు. అందువల్లే అలాంటి పరిస్థితి తలెత్తకుండా నివారించేందుకు ‘పాపులేషన్ కంట్రోల్ లా’ అవసరమని ఆయన వ్యాఖ్యానించారు.
మోడీ, అమిత్ షా.. ఇద్దరూ 2024 ఎన్నికలకు ముందు ఈ చట్టంతో బాటు ఉమ్మడి పౌర స్మృతిఅమలుకు సంబంధించి కూడా ‘శాసనం’ తేవచ్చునని, ఇదే సమయంలో కాశీ, మధురలలో ఆలయాల నిర్మాణంపై సైతం వారు దృష్టి పెడతారని ఆయన చెప్పారు. ఈ చర్యలు హిందువులను పరిరక్షించడమే గాక.. వారి పార్టీ (బీజేపీ) కి కూడా ప్రయోజనం కల్పిస్తాయని ప్రవీణ్ తొగాడియా అన్నారు.
భారత్ ఇదివరకే ‘హిందూ రాష్ట్ర’మైందని, దీన్ని హిందూ పొలిటికల్ స్టేట్ గా మార్చాలన్నది తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇండియాలో తాము అభద్రతా భావంలో బతుకుతున్నామని హిందువులెవరూ భావించరాదని తాము కోరుకుంటున్నామన్నారు.