కేంద్ర మాజీ మంత్రి, దివంగత సుష్మాస్వరాజ్ 70వ జయంతి సంద్భంగా ప్రధాని మోడీ ఓ ఆసక్తికర విషయాన్ని ప్రజలతో పంచుకున్నారు. పంజాబ్ లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొని తిరిగి వచ్చిన తర్వాత ఆయన సుష్మా స్వరాజ్ కు సోమవారం నివాళులు అర్పించారు. అనంతరం గుజరాత్ కు సుష్మాస్వరాజ్ వచ్చినప్పుడు జరిగిన ఓ విషయాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.
‘ దాదాపు 25 ఏండ్ల క్రితం. అప్పుడు నేను బీజేపీ ఆర్గనైజర్ గా పనిచేస్తు్న్నాను. ఎన్నికల పర్యటనలో భాగంగా సుష్మాజీ గుజరాత్ కు వచ్చారు. అక్కడ నుంచి మా గ్రామం వాద్ నగర్ కు ఆమె వెళ్లారు. అక్కడ మా తల్లిని ఆమె కలుసుకున్నారు. ఆ సమయంలో మా మేనల్లుడికి ఒక కూతరు జన్మించింది” అని చెప్పారు.
‘ ఆ పాపకు జాతకం ప్రకారం ఏ పేరు పెట్టాలనే విషయాన్ని అప్పటికే నిర్ణయించాము. కానీ సుష్మా స్వరాజ్ ను కలుసుకున్న తర్వాత మా తల్లి ఆమె నిర్ణయాన్ని మార్చుకున్నారు. వెంటనే ఇక నుంచి ఆ పాపను సుష్మా అని పిలుస్తాము అని మా తల్లి ప్రకటించేశారు. ఈ విషయాన్ని ఇప్పటికీ నేను గుర్తు చేసుకుంటాను” అని తెలిపారు.
‘ విదేశాలతో భారతదేశ సంబంధాలను మెరుగుపరచడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. అంతే కాకుండా ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా కష్టాల్లో ఉన్న భారతీయులకు సహాయం చేసిన కరుణా మూర్తి. ఆమె ఓ అద్భుతమైన నాయకురాలు” అంటూ ప్రధాని మోడీ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.