– సంక్షోభంలో మోడీ సహాయం చేస్తారని ప్రజలకు తెలుసు
-ప్రపంచానికి భారత్ ఆశాదీపంగా మారింది
-జీ 20 అధ్యక్షత కూడా కొందరిని బాధిస్తోంది
-యూపీఏ హయాంలో తీవ్రవాదులు చెలరేగిపోయారు
-కామన్వెల్త్ కుంభకోణంతో దేశం పరువు పోయింది
– దేశం కోసం కాదు.. ఈడీ వల్లే విపక్షాలు ఏకమయ్యాయి
-రాష్ట్రపతి ప్రసంగ తీర్మానంలో మోడీ ఫైర్
ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందని ప్రధాని మోడీ అన్నారు. కరోనా సమయంలో ప్రపంచానికి భారత్ ఆశాదీపంగా మారిందని ఆయన పేర్కొన్నారు. 100 ఏళ్లకు ఒకసారి వచ్చే సంక్షోభం ఒక వైపు.. యుద్ధ పరిస్థితులు మరోవైపు ఉన్నాయన్నారు.
అలాంటి కఠిన పరిస్థితుల్లోనూ భారత్ మాత్రం స్థిరంగా ఉందని వెల్లడించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్ సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. ఆదివాసి సమాజానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ద్వారా గొప్ప గౌరవం దక్కిందన్నారు.
దేశాధినేతగా రాష్ట్రపతి ముర్ము భారత మహిళలకు స్ఫూర్తిగా నిలిచారని ఆయన అన్నారు. కానీ అలాంటి రాష్ట్రపతిని అవమానించేలా కొందరు నేతలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రపతి తన ప్రసంగంతో అందరిలో స్ఫూర్తి నింపారని ఆయన కొనియాడారు.
విపక్ష నేతలంతా దేశం కోసం ఏకం కాలేదని, వారంతా ఈడీతోనే ఒక్కటవుతున్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు. యూపీఏ పాలనలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తీవ్ర వాదులు చెలరేగిపోయారంటూ ఆయన ఆరోపించారు.
యూపీఏ పాలనలో కశ్మీర్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు అంతటా హింసే కనిపించిందని ఆరోపణలు గుప్పించారు. యూపీఏ హయంలో జరిగిన కామన్వెల్త్ ఆటల కుంభకోణం గురించి ఆయన ప్రస్తావించారు. ఈ కుంభకోణంతో దేశం పరువుపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఉత్థాన పతనాలపై హార్వర్డ్ వర్శిటీలోనూ పరిశోధన జరిగిందని చెప్పారు. దీనిపై కేవలం హార్వర్డ్ మాత్రమే కాకుండా ప్రపంచంలోని పెద్ద విశ్వవిద్యాలయాలన్నీ పరిశోధనలు జరపాలని ఆయన ఎద్దేవా చేశారు.
జీ 20 సమూహానికి భారత్ నాయకత్వం వహిస్తోందని ఆయన వెల్లడించారు. ఇది భారతీయులకు ఎంతో గర్వకారణమైన విషయమని తెలిపారు. జీ20 సమూహానికి దేశ నాయకత్వం వహించడం కూడా కొందరిని బాధిస్తోందని ఆయన అన్నారు.
కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ దేశాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాయన్నారు. కానీ ప్రస్తుతం కరోనా సంక్షోభం నుంచి భారత్ పూర్తిగా బయటపడిందన్నారు. కరోనా సమయంలో పలు దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్లు అందించామన్నారు. దీంతో పలు దేశాలు భారత్‌ను ప్రశంసించాయన్నారు.
దేశ ప్రజలు తనపై భరోసా ఉంచారన్నారు. ఇది టీవీ ప్రచారాల కారణంగా రాలేదన్నారు. దేశ ఉజ్వల భవిష్యత్ కోసమే మోడీపై ప్రజల్లో విశ్వాసం ఏర్పడిందన్నారు. సంక్షోభంలో ఉన్నప్పుడు మోడీ సహాయం చేస్తారని ప్రజలందరికీ తెలుసన్నారు.