– మోడీ తెలంగాణ పర్యటన ఖరారు
– బీఆర్ఎస్ సభ తర్వాత తొలిసారి రాష్ట్రానికి రాక
– పరేడ్ గ్రౌండ్ లో సభ ఉంటుందా..?
– కేసీఆర్ వ్యాఖ్యలపై మోడీ రియాక్ట్ అవుతారా?
– జాతీయ నేతలకు కౌంటర్ ఇస్తారా?
తెలంగాణలో అధికారం కోసం బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఈమధ్యే అధిష్టానం గ్రామస్థాయికి వెళ్లాలని రాష్ట్ర నేతలకు ఆదేశాలు జారీ చేసింది. ఇటు అగ్ర నేతల టూర్లు కూడా ఒక్కొక్కటి ఫిక్స్ అవుతున్నాయి. ఇప్పటికే ప్రధాని మోడీ రావాల్సి ఉండగా.. కొన్ని కారణాలతో అది వాయిదా పడింది. అయితే.. తాజాగా మోడీ పర్యటన ఖరారైంది.
ఫిబ్రవరి 13న మోడీ తెలంగాణకు పర్యటనకు వస్తున్నారు. సికింద్రాబాద్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. జనవరి 19నే సికింద్రాబాద్ లో వందేభారత్ రైలును ప్రారంభించాల్సి ఉండగా.. ఆ పర్యటన రద్దయింది. ఇక తాజాగా ఫిక్సయిన టూర్ లో ప్రధాని రూ.7వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
ప్రధాని రాక సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో సభ ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. పార్టీపరమైన సభ కావడంతో మోడీ ఏం మాట్లాడతారా? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మొన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరిగింది. ఖమ్మం గడ్డపై బీజేపీపై సమరశంఖం పూరించింది బీఆర్ఎస్. ఈ సభలో సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే.. సభకు హాజరైన జాతీయ నేతలు కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. ఇప్పుడు మోడీ బీజేపీ సభలో ఆ కామెంట్స్ కు కౌంటర్స్ ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
మోడీ కంటే ముందే అమిత్ షా రాక
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన కూడా ఈమధ్యే ఖరారైంది. ఈనెల 28న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో ఉన్నారు బీజేపీ నేతలు. 28న అసిఫాబాద్ కు చేరుకున్న తర్వాత.. కొమురం భీమ్ పురిటిగడ్డ జోడేఘాట్ ను సందర్శించి నివాళి అర్పిస్తారు షా. అనంతరం మార్లవాయికి వెళ్లి పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజును సన్మానిస్తారు.ఆ తర్వాత జైనూర్ లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులతో షా సమావేశం అవుతారు. పార్టీ బలోపేతంపై వారికి దిశానిర్దేశం చేస్తారు. జనవరి 28న ఒక్కరోజే కాదు.. 29న కూడా అమిత్ షా పర్యటన ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. రెండో రోజు ఆదివాసీలు ఉండే ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తారని వార్తలు వస్తున్నాయి.