విద్యుత్ విషయంలో కేంద్రం పాలసీ పై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. దేశ ప్రజలను విద్యుత్ వినియోగానికి దూరం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. పీక్ లోడ్ హవర్స్ లో ప్రతి యూనిట్ కు 20 శాతం అదనపు ఛార్జీ వసూలు చేయాలన్న కేంద్ర నిర్ణయంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనాన్ని సమకూర్చడానికే మోడీ సర్కార్ పాలన సాగుతోందని, పేద ప్రజలకు సబ్సిడీలు ఎత్తేసే కుట్ర జరుగుతోందని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీల భారాన్ని భరించి నాణ్యమైన విద్యుత్ ఇస్తుంటే కేంద్రం ప్రజలపై అదనపు భారాన్ని వేస్తుందని ఆయన ఫైర్ అయ్యారు.
గతంలోనూ తెలంగాణ విద్యుత్ పై కుట్రలు చేసి రుణాలు రాకుండా కేంద్రం అడ్డుకుందన్నారు. పేదలపై భారం వేయడాన్ని తెలంగాణ సర్కార్ తప్పని సరిగా అడ్డుకుంటుందని.. మోడీ దుర్మార్గపు పాలనకు ప్రజలు ఫుల్ స్టాప్ పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.