ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాతృమూర్తి హీరాబెన్ మోడీ 100వ పుట్టిన రోజు సందర్భంగా.. ఆమెకు అరుదైన గౌరవం దక్కింది. కీర్తి, ప్రతిష్ఠలు శాశ్వతంగా నిలిచేందుకు ఓ రోడ్డుకు ఆమె పేరు పెట్టాలని గాంధీ నగర్ నగర పాలక సంస్థ నిర్ణయించింది. సేవా భావానికి సంబంధించిన పాఠాలను భావి తరాలు ఆమె జీవితం నుంచి నేర్చుకునేందుకు అవకాశం ఉంటుందనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నగర పాలక సంస్థ తెలిసింది.
గుజరాత్ రాజధాని నగరం గాంధీ నగర్ ప్రజల కోరికను, వారి భావాలను దృష్టిలో ఉంచుకుని ఓ రోడ్డుకు ఆమె పేరు పెట్టాలని నిర్ణయించినట్టు గాంధీ నగర్ మేయర్ హితేశ్ మక్వానా తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రైసన్ పెట్రోలు బంకు నుంచి 80 మీటర్ల పొడవుగల మార్గానికి ‘‘పూజ్య హీరాబా మార్గ్’’ అని పేరు పెట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు.
త్యాగం, తపన, సేవ, అంకిత భావంతో పని చేయడం వంటి అంశాలను ఆమె జీవితం నుంచి భావితరాలు నేర్చుకోవాలని సూచించారు. హీరాబెన్ కీర్తి, ప్రతిష్ఠలు శాశ్వతంగా నిలిచిపోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
హీరాబా గాంధీనగర్ నగర శివార్లలోని రైసన్ గ్రామంలో తన చిన్న కుమారుడు పంకజ్ మోడీతో కలిసి ఉంటోంది. ప్రధాని మోడీ జూన్ 17 ,18 తేదీల్లో గుజరాత్‌లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. వాద్‌నగర్ లో హీరాబా కుమారులు పెద్ద వేడుకను కూడా నిర్వహించారు.