కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగిలయ్యకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన పురస్కారం ఇంకా దక్కలేదని చెప్పినట్టుగా ఆ వీడియో ఉంది. అయితే.. దీన్ని కొందరు తమ స్వార్థానికి వాడుకుంటున్నారని మొగిలయ్య ఆరోపణలు చేశారు. తనకున్న కళను గుర్తించే తెలంగాణ ప్రభుత్వం తనకు ఆ గౌరవాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.
బీజేపీకి సంబంధించిన కొందరు తనతో మాట్లాడిన వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన ఇంటి స్థలంతో పాటు.. ఇస్తానన్న రూ. కోటి అందాయా..? అంటూ అచ్చంపేటకు చెందిన కొందరు బీజేపీ నేతలు అడిగారని చెప్పారు మొగిలయ్య.
అయితే.. ఇంకా అందలేదని, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇప్పించేందుకు కృషి చేస్తున్నారని సమాధానమిచ్చానన్నారు. వారితో తాను మాట్లాడిన మాటలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారని ఆరోపించారు. ఇదే విషయమై ఓ బీజేపీ నాయకున్ని అచ్చంపేటలో రోడ్డుపైనే నిలదీశానని స్పష్టం చేశారు.
తనకు రాష్ట్రప్రభుత్వం అండగా నిలిచిందన్నారు మొగిలయ్య. ఇన్నేళ్ల తర్వాత తన కళను టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించిందని ఆనందం వ్యక్తం చేశారు. కానీ.. కొందరు బీజేపీ నేతలు తనపై రాజకీయాలు చేస్తూ.. పద్మ శ్రీ అవార్డును కేంద్రం ఇచ్చిందని అంటున్నారని.. అవసరమైతే దాన్ని వాపసు ఇచ్చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. తమ సొంత రాజకీయా ప్రయోజనాలకోసం తన నోట్లో మట్టి కొట్టవద్దని కోరారు మొగిలయ్య.