ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి రేసులో భారత్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా పలు రంగాల్లో విశేష కృషి కనబరిచిన వారికి నోబెల్ ప్రైజ్ ప్రకటిస్తారు. నోబెల్ శాంతి బహుమతి అక్టోబర్ 7న ప్రకటించనున్నారు. నోబెల్ శాంతి బహుమతి కోసం శుక్రవారం విడుదల చేసిన అనధికార షార్ట్ లిస్ట్ లో భారతీయులు రేసులో ఉన్నారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ కట్టడే లక్ష్యంగా ప్రారంభమైన ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా, మహ్మద్ జుబైర్ లు నోబెల్ శాంతి ప్రైజ్ రేసులో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
నోబెల్ శాంతి బహుమతి 2022 కోసం 341 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 251 మంది, 92 సంస్థలు ఉన్నాయి. సాధారణంగా నోబెల్ కమిటీ నామినీల పేర్లను మీడియాకు గానీ, అభ్యర్థులకు గానీ, అసలు తెలియజేయదు. కాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలన్ స్కీతో పాటు బెలారస్ ప్రతిపక్ష నేత స్వియాట్లావా సిఖానౌస్కాయ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావాల్ని, స్వీడన్ వాతావరణ కార్యకర్త గ్రేటా థన్ బర్గ్ శాంతి బహుమతి రేసులో ఉన్నారు.
కాగా జర్నలిస్టులు మహ్మద్ జుబైర్, ప్రతీక్ సిన్హా భారతదేశంలో తప్పుడు సమాచారంపై పోరాడుతున్నారు. సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న పుకార్లలో ఏది నిజమో.. ఏది నకిలీదో అని తేలుస్తున్నారు. హర్ష్ మందర్ 2017లో కార్వాన్-ఎ-మొహబ్బత్ ప్రచారాన్ని ప్రారంభించారు. మతపరమైన తీవ్ర వాదం, అసహనం, హింస, వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.
సోషల్ మీడియా వేదికగా పోస్ట్ అవుతున్న వీడియోల వాస్తవికతను వెల్లడించడమే లక్ష్యంగా ఆల్డ్ న్యూస్‌ను జుబైర్, ప్రతీక్‌లు ప్రారంభించారు. సోషల్ మీడియాలో పోస్ట్ అవుతున్న వీడియోల ఆధారంగానే ఈ వెబ్‌సైట్ వార్తలను ప్రచురిస్తోంది. అయితే నాలుగేళ్ల క్రితం నాటి ఓ ట్వీట్ ఆధారంగా జుబైర్‌పై ఢిల్లీ పోలీసులు కేసు పెట్టి ఆయనను అరెస్ట్ చేశారు. నెల రోజుల పాటు న్యాయపోరాటం చేసిన జుబైర్ సుప్రీంకోర్టులో బెయిల్ తీసుకుని జైలు నుంచి విడుదలయ్యారు.