“ప్రస్తుతం నేను నా జీవిత కథ రాసే పనిలో ఉన్నా అందులో నిజాలు రాస్తున్నాను. ఇప్పటికే కొంత వరకు రాసి ఆపాను. దానికి ఇంకా టైటిల్ పెట్టలేదు. దీన్ని తెరపైకి తీసుకురావాలా? తీసుకొస్తే ఎవరితో చేయాలి? అన్నది నేనేమీ ఆలోచించలేదు”.
మంచు మోహన్ బాబు తాజా స్టేట్ మెంట్ ఇది. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన ఈ సీనియర్ నటుడు.. తన జీవిత చరిత్రకు అక్షర రూపం ఇస్తున్న విషయాన్ని కూడా బయటపెట్టారు. అయితే అది ఎప్పటికి పూర్తవుతుందనే విషయాన్ని మాత్రం మోహన్ బాబు చెప్పలేకపోయారు. సీనియర్ జర్నలిస్ట్ ప్రభు ఆధ్వర్యంలో ఆ పుస్తకం వస్తోందని, దానికి ఇంకా టైటిల్ పెట్టలేదన్నారాయన.
సీనియర్ నటులు ఇలా బయోపిక్స్ రాసుకోవడం కొత్త కాదు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఇప్పటికే అందుబాటులో ఉంది. ఏఎన్నార్ జీవిత చరిత్ర కూడా అందుబాటులో ఉంది. ఇక చిరంజీవి సినీ విశేషాలు, జీవిత విశేషాలతో చాలా పుస్తకాలు మార్కెట్లో లభ్యం అవుతున్నాయి. నిజానికి మోహన్ బాబుపై కూడా కొన్ని పుస్తకాలున్నాయి. అయితే తనే స్వయంగా రాయిస్తున్న జీవిత చరిత్ర కావడంతో దీనిపై అందర్లో ఆసక్తి నెలకొంది.
ఇక ఈ జీవిత చరిత్రను బయోపిక్ గా తీస్తే అందులో ఎవరు హీరోగా నటిస్తారనే ప్రశ్నకు సమాధానంగా మోహన్ బాబు స్పందించలేదు. ఆ కోణంలో ఆలోచించలేదన్నారాయన. అయితే ఫిలింనగర్ లో మాత్రం దీనిపై అప్పుడే చర్చ మొదలైంది. ఎన్టీఆర్ బయోపిక్ లో బాలయ్య నటించినట్టుగా, మోహన్ బాబు బయోపిక్ లో మంచు విష్ణు నటిస్తే బాగుంటుందంటూ చర్చ సాగుతోంది.