నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది. ఈ సినిమా ఎన్నో అడ్డంకులను అధిగమించి మంచి విజయం సాధించింది. గురువారం విడుదల అయిన ఈ చిత్రం మంచి కలెక్షన్స్ సాధించింది. ఇక ఈ సినిమాపై ఇండస్ట్రీ మొత్తం ప్రశంసలు కురిపిస్తుంది. కాగా తాజాగా ఇంతటి గొప్ప విజయాన్ని సాధించిన బాలకృష్ణను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మా చైర్మన్ విష్ణు మంచు కలిసి అభినందించారు.
ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ అఖండ సినిమా పరిశ్రమను పునరుద్ధరించిందని అన్నారు. భయపెట్టే పరిస్థితుల్లోను మేము గెలుస్తూనే ఉన్నామని అన్నారు. ఆ మధ్య ప్రేక్షకులు థియేటర్లలోకి రావడం లేదని విన్నాం. అయితే ఈ క్లిష్ట పరిస్థితిలో అఖండ ఆశ్చర్యకరమైన రిజల్ట్ తీసుకొచ్చింది. ఈ సినిమా విజయం పరిశ్రమలోని మిగతా వారికి ఎన్నో ఆశలు కల్పించిందని అన్నారు మోహన్ బాబు. మంచి సినిమాలను థియేటర్లలో చూస్తామని మరోసారి నిరూపించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.
మరోవైపు మంచు విష్ణు మాట్లాడుతూ మా అన్నయ్య బాలయ్య కి, దర్శకుడు బోయపాటి శ్రీను కి, నిర్మాతతో పాటు చిత్రబృందం మొత్తానికి అభినందనలు తెలిపారు.