ప్రధాని నరేంద్రమోడీతో సినీ నటుడు మోహన్ బాబు భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. మోహన్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానితో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను బీజేపీలో చేరాలని మోడీ ఆహ్వానించినట్లు తెలుస్తుంది. అయితే వైసీపీలో కొనసాగుతున్న మోహన్ బాబు సడెన్ గా ఇలా మోడీని కలవడం ఏంటని పలువురు చర్చించుకుంటున్నారు.
మోహన్ బాబు సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. నాటి ప్రభుత్వ వ్యవహారశైలిపై ఆయన తీవత్రస్థాయిలో విమర్శలు చేశారు. జగన్ తోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని అందుకే తాను వైసీపీలో చేరుతున్నానని చెప్పారు. ఆయన పార్టీలో చేరిక సమయంలో మోహన్ బాబుకు జగన్ కీలక హామీ ఇచ్చినట్లు అప్పట్లో ప్రచారం సాగింది. అనుకున్నట్లుగానే ఏపీలో జగన్ అధికారంలోకి రావడంతో మోహన్ బాబుకు కీలక పదవి రాబోతుందని పొలిటికల్ కారిడార్ లో ప్రచారం సాగింది. మొదట ఆయనను టీటీడీ చైర్మన్ గా నియమిస్తారని ప్రచారం సాగినా… ఆ పదవి జగన్ బంధువు వైవీ సుబ్బారెడ్డికి కట్టబెట్టారు. ఆ తరువాత ఆయనకు ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కే ఛాన్స్ ఉందని ఊహాగానాలు వచ్చాయి. అయితే వైసీపీలో కొనసాగుతున్న మరో నటుడు విజయ్ చందర్‌కు ఆ పదవిని ఇచ్చారు సీఎం జగన్. దీంతో మోహన్ బాబుకు పార్టీలో ప్రాధాన్యత తగ్గుతుందని ప్రచారం సాగింది. అయినప్పటికీ తనకు రాజ్యసభ సీటు ఖాయమని మోహన్ బాబు భావించారు. కానీ అందుకు జగన్ నుండి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో మోహన్ బాబు బీజేపీ చూస్తున్నారని రాజకీయాల్లో ఊహాగానాలు వినబడుతున్నాయి. జగన్ పై అలకతోనే మోహన్ బాబు ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఉంటారని ఇండస్ట్రీ వర్గాల టాక్.
పైగా ఇటీవల జరిగిన జీఎస్టీ సోదాలు కూడా కారణం కావొచ్చని… మంచు ఫ్యామిలీ చూస్తున్న విద్యాసంస్థల్లో అక్రమాలు జరిగాయంటూ వార్తలు కూడా వినిపించినందున ఏ అంశాలను కూడా తీసిపారేయ్యలేమని టాక్ వినపడుతోంది.