ప్రేక్షకుడు ఏ కథను మెచ్చుకుంటాడు, ఏ కథనాన్ని ఇష్టపడతాడు. ఏ పాత్రకు పట్టం కడతారు. ఏ నటుణ్ణి నెత్తిన పెట్టుకుంటాడనేది, సినిమా హిట్టయ్యేవరకూ సినీ విమర్శకులకే కాదు.దర్శక నిర్మాతలకు కూడా తెలియదు.
ఒక్కటి మాత్రం నిజం. ప్రేక్షకుడికి కనక్ట్ అయ్యే ఎమోషన్ని తెరమీద పండించగలిగితే ప్రేక్షకుడు తప్పకుండా ఓటేస్తాడు. తాను పొందిన అనుభూతే తోటివారు కూడా పొందాలంటూ తానే సినిమాను పదిమందికి ప్రచారం చేస్తాడు.
నిజానికి ఏ కథైనా, పాత్రైన ఏస్థాయిలో సక్సెస్ అవుతుందో స్క్రీన్ మీదకు వెళ్ళకుండా స్క్రిప్ట్ దశలో ఎవరూ ఊహించలేరు. అంచనాలకు అందక ఎన్నో మంచి కథల్ని, పాత్రల్ని వదులుకున్న హీరోలు, నటీనటులూ ఎంతోమంది ఉన్నారు.
అది మామూలు సినిమా అయితే పర్వాలేదు. దేశం గర్వించదగ్గ బాహుబలిలాంటి సినిమా అయితే, కట్టప్పలాంటి నమ్మిన బంటు పాత్ర అయితే ఆ బాధ రెట్టింపు అవుతుంది. బాహుబలి సినిమాలో కథానాయకుడికి గురువుగా, స్నేహితుడిగా, సహాయకుడిగా, శివగామికి నమ్మిన బంటుగా ఉండే కట్టప్ప పాత్ర జనంలోకి ఎంతగా చొచ్చుకు పోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అయితే నమ్మకంగా ఉంటూనే కథానాయకుడిని వెన్నుపోటు పొడుస్తాడు. ఇదే పాయింట్ తో ఉత్సుకత రేకెత్తించే ఇంట్రస్టింగ్ ఎండ్ ఇచ్చి , సెకెండ్ పార్టుకోసం జుట్టుపీక్కుంటూ వెయిట్ చేసేలా చేసాడు దర్శకుడు. అయితే రెండో పార్ట్ లో కట్టప్ప క్యారెక్టర్ చాలా కీలకమైంది.
ఈ సినిమాలో ఆ పాత్రకి అంత ప్రాధాన్యత ఉంది కాబట్టే ఈ పాత్ర కోసం మొదట దర్శకుడు రాజమౌళి మలయాళ సూపర్ స్టార్ అయిన మమ్ముట్టిని అడిగినట్టు తెలుస్తుంది. కానీ మమ్ముట్టి మైండ్ కి ఈ పాత్ర ఎక్కలేదు. మోహన్ లాల్ కూడా ఈ పాత్ర నచ్చక రిజక్ట్ చేశాడని తెలుస్తోంది.
కానీ ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆ పాత్ర చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. దీంతో మోహన్ లాల్ ఈ పాత్ర చేస్తే ఇంకా హైలెట్ గా ఉండేదని ఆయన కూడా తన సన్నిహితుల దగ్గర చెప్పినట్టు తెలిసింది…
ప్రస్తుతం రాజమౌళి సినిమాలో ఏ చిన్న అవకాశం వచ్చిన చేయాలని ఆరాటపడే ఆర్టిస్టులు ఎంతోమంది ఉన్నారు. ఒకసారి ఆయన సినిమాలో ఒక ఫ్రేమ్ లో నటించినా చాలు నటుడిగా నా జన్మధన్యం అనుకునే నటులు కూడా లేకపోలేదు.