గాడ్ ఫాదర్ ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడుతున్న దర్శకుడు మోహన్ రాజా. తన టాలీవుడ్ రీఎంట్రీకి సంబంధించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. గాడ్ ఫాదర్ తన రీఎంట్రీ మూవీ అవుతుందని భావించలేదని తెలిపాడు. నిజానికి నాగార్జున సినిమాతో రీఎంట్రీ ఇవ్వాలనేది మోహన్ రాజా ప్లాన్.
“నాగార్జునకు ఓ కథ చెప్పాను. స్క్రిప్ట్ మొత్తం రెడీగా ఉంది. ఆ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టాలనుకున్నాను. అంతలోనే చిరంజీవి నుంచి పిలుపు వచ్చింది. గాడ్ ఫాదర్ ఆఫర్ ఇచ్చారు. నాగార్జునతో సినిమా ఉందని చెప్పాను. వెంటనే చిరంజీవి, నాగార్జునను పిలిచారు. ముగ్గురుం కూర్చున్నాం. ఇద్దరితో సినిమాలు చేయమని నాగ్-చిరంజీవి అన్నారు. కాకపోతే ముందుగా గాడ్ ఫాదర్ చేయమన్నారు. నాగార్జున దానికి హ్యాపీగా ఒప్పుకున్నారు. ఇలా ఇద్దరు హీరోలు కలిసి నన్ను ప్రోత్సహించారు.”
సరిగ్గా 2020 నవంబర్ లో గాడ్ ఫాదర్ ప్రాజెక్టు స్టార్ట్ చేశాడట మోహన్ రాజా. అప్పట్నుంచి ఈ సినిమాపై వర్క్ చేస్తూ, ఇన్నాళ్లకు ఆ ప్రాజెక్టును ప్రేక్షకులముందుకు తీసుకొచ్చానని చెప్పాడు. చిరంజీవిపై తీసిన ప్రతి సన్నివేశాన్ని, వెయ్యిమంది మధ్య కూర్చొని చూస్తే ఎలాంటి రియాక్షన్ వస్తుందనే ఆలోచనతో తీశానని వెల్లడించాడు.
ఇక నాగార్జున సినిమాపై స్పందిస్తూ, తన నెక్ట్స్ ప్రాజెక్ట్ అదేనని ప్రకటించాడు. కథ, స్క్రీన్ ప్లే మొత్తం సిద్ధంగా ఉందని, మరోసారి సరిచూసుకొని సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యమని తెలిపాడు. నాగార్జునతో యాక్షన్ సినిమా చేయబోతున్నాడు మోహన్ రాజా. కాకపోతే యాక్షన్ తో పాటు ఎమోషనల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నాడు.