పద్నాలుగు శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం, మానవ హక్కుల కోసం జరిగిన చరిత్రాత్మక పోరాటమే మొహర్రం
హైదరాబాద్: ఇవాళ మొహర్రం. అరబ్బీ కేలండర్ మొదటి మాసం.. మొదటి రోజు ఇది. ఈరోజు నుంచే ఇస్లామ్ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ప్రాచీన కాలంలో యూదులు, క్రైస్తవులు ఈ కేలండర్ వాడేవారు.
మొహర్రం అంటే ఫెస్టివల్ కాదు, ఇవి సంతాప దినాలు. మొహర్రం జరిగే ఈ పది రోజులూ విషాద దినాలే కాని, ఎంత మాత్రం పర్వదినాలు కావు. పండుగ అనుకుని చాలామంది శుభాకాంక్షలు చెబుతారు. అది తప్పు. ముస్లిం సోదరులు బాధ పడతారు.
ఈ పేరు వినగానే పీర్లు, నిప్పుల గుండాలు, గుండెలు బాదుకుంటూ మాతం చదవటాలు గుర్తుకొస్తాయి మనందరికీ.
తెలుగు రాష్ట్రాల్లో అనేక తరాలుగా ముస్లిం సోదరులు, హిందువులు కలిసి మెలిసి వుంటున్నారు. ఓట్ల కోసమే నేతలు చీల్చి లేనిపోని విద్వేషాలు రగులుస్తారు తప్ప, మన ఊళ్లల్లో అందరూ వరుసలతో పిలుచుకుంటారు ఇప్పటికీ. పీర్ల పండుగలో హిందువులు కూడా పాల్గొనడం గోదావరి జిల్లాల్లో చూడచ్చు. మొహర్రం సంతాప దినాల్ని పాటించేందుకు తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం సోదరులు నిమగ్నమై వున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ మసీదుల్లో ప్రత్యేక ప్రార్ధనలు జరుగుతున్నాయి. ఓపక్క గణేశ నిమజ్జనం, మరోపక్క పీర్ల పండగ.. ఊళ్లల్లో సందడి సందడిగా వుంది. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదే కదా!