ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన కేసీఆర్.. ఆయన కుటుంబ సంక్షేమం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు ఆరోపించారు ప్రొఫెసర్ కోదండరాం. సంగారెడ్డిలో నిర్వహించిన తెలంగాణ జనసమితి పార్టీ రెండవ ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతి, అక్రమాలకు పాల్పడినందుకే సీఎం కేసీఆర్ గ్రాఫ్ పేకమేడలా కూలిపోయిందని అన్నారు. తన రాజకీయ పరపతి కోల్పోవడంతో దిక్కులేని స్థితిలో ప్రశాంత్‌కిషోర్ ను తెచ్చుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.
భూమి ఇచ్చేవారి బతుకు బాగు పడాలని కోరుకుంటున్నామని అన్నారు. నీమ్జ్ ప్రాజెక్టు రాకూడదని రైతుల పక్షాన కోర్టుకు వెళ్ళామని చెప్పారు. సింగరేణి భూ నిర్వాసితుల సమస్యలపై కూడా పోరాటం చేశామని పేర్కొన్నారు. కాళేశ్వరం ఎత్తి పోత పథకం వల్ల వేల ఎకరాల పంట భూములు మునిగి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
భూములు గుంజుకోవడంలో ఎనుకటి జమీందార్లను మించిపోయారని ఆయన విమర్శలు గుప్పించారు. తెలంగాణలో భూములకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్ర ఖజానాను ఇష్టం వచ్చిన విధంగా ఖర్చు పెట్టి, కమీషన్ కోసం పనిచేస్తున్నారని అన్నారు. చట్టం ఎవరి చుట్టం కాదని.. చేసిన పాపాలకు ఈ జన్మలోనే ఫలింతం దక్కుతుందని అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజ్యాంగ పరిరక్షణ యాత్రకు సిద్ధం అయ్యామని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత ధైర్యంగా ముందుకు తీసుకువెళ్తామని పేర్కొన్నారు. భవిష్యత్తు ఎజెండాను నిర్థారిస్తామని ప్రకటించారు. తెలంగాణ ఆకాంక్షకు తూట్లు పొడిచిన పాలనను అంతమొందించడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కరూ జెండాలకు అతీతంగా సంపూర్ణ సహకారం అందించాలని కోదండరాం చేతులు జోడించి అభ్యర్థించారు.