యూరప్ లో మంకీపాక్స్ ఆందోళన కలిగిస్తోంది. ఐరోపా దేశాలు బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్, పోర్చుగల్, స్పెయిన్, స్వీడన్ లల్లో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మంకీపాక్స్ కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.
వీటితో పాటు యూఎస్ఏ,కెనడా, అస్ట్రేలియా, బ్రిటన్ లోనూ మంకీ పాక్స్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ శుక్రవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆయా దేశాల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది.
‘ మనం వేసవి కాలంలో ఉన్నాము. ఇప్పుడు పండుగలు, పార్టీలు, ఇతర కార్యక్రమాల కారణంగా పెద్ద ఎత్తున ప్రజలు ఒక చోట కలుసుకునే అవకాశం ఉంది. దీంతో ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది’ అని డబ్ల్యూహెచ్ఓ ఐరోపా ప్రాంతీయ డైరెక్టర్ హన్స్ కూల్గే తెలిపారు.
ఐరోపాలో ఇప్పటి వరకు 100కు పైగా కేసులు నమోదైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. స్పెయిన్ లో శుక్రవారం 24 కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 30కు చేరింది.