దేశంలో మంకీ పాక్స్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా రెండు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం మంకీ పాక్స్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. ఢిల్లీలో నివసిస్తున్న ఓ నైజీరియన్ కు మంకీపాక్స్ సోకినట్లు అధికారులు పేర్కొన్నారు. కేరళలోని మలప్పురంలో మరో వ్యక్తికి కూడా మంకీపాక్స్ సోకినట్టు అధికారులు తెలిపారు.
దీంతో దేశ రాజధానిలో కేసుల సంఖ్య రెండుకు చేరింది. ప్రస్తుతం నైజీరియన్ ఢిల్లీలోని ఎన్ఎల్ జేపీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతను ఇటీవల విదేశీ పర్యటనలేమీ చేయలేదని అధికారులు తెలిపారు.
గత ఐదు రోజులుగా నైజీరియన్ జ్వరంతో బాధపడుతున్నాడని, శరీరంపై దద్దుర్లు కూడా వచ్చాయని అధికారులు వెల్లడించారు. పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి)కి అతని శాంపిల్స్ ను పంపించినట్టు అధికారులు చెప్పారు.
కేరళలో మళప్పురంలో మరో వ్యక్తికి మంకీపాక్స్ వచ్చినట్టు ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. అతను ఇటీవల యూఏఈకి వెళ్లివచ్చినట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
మరోవైపు ప్రపంచంలో 77 దేశాలకు మంకీపాక్స్ వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 20 వేలకు పైగా కేసులు నమోదు కాగా సుమారు 75 మంది మరణించారు.