ప్రపంచ దేశాలను మొన్నటి వరకు కరోనా వైరస్ వణికిస్తే… ఇప్పుడు కొత్తగా మంకీపాక్స్ వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే 78కు పైగా దేశాల్లో 18వేల కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా యూరప్, అమెరికా దేశాలు ఈ వ్యాధికి ఎక్కువగా గురువుతున్నాయి.
ఒక్క యూరప్ దేశాల్లోనే 70 శాతం కేసులు నమోదు అవ్వగా… 25 శాతం కేసులు అమెరికా ప్రాంతంలో నమోదు అయ్యాయి. ఇక ఇండియాలో కూడా ఇప్పటికే 4 మంకీ పాక్స్ వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి.
ఇందులో కేరళలో మూడు, ఢిల్లీలో ఒక కేసు నమోదు అయ్యింది.
అయితే దేశవ్యాప్తంగా మంకీపాక్స్ అనుమానితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇదిలా ఉంటే ఇండియాలో మంకీపాక్స్ వైరస్ రకం… యూరోపియన్ రకంతో పోలీస్తే భిన్నంగా ఉందని సైంటిస్టులు కనుగొన్నారు.
పుణెలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు …. రెండు రకాల వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించారు. ప్రస్తుతం ఇండియాలోని మంకీపాక్స్ వైరస్ ఏ.2 రకానికి చెందినదిగా గుర్తించారు.
ఇది మిడిల్ ఈస్ట్ నుంచి భారత్ కు వచ్చింది. అంతకు ముందు ఈ రకం థాయ్ లాండ్, యూఎస్ లో 2021 లో వ్యాధి వ్యాప్తికి కారణం అయ్యింది. యూరప్ దేశాల్లో మంకీపాక్స్ వ్యాధి తీవ్రమైన వ్యాప్తికి కారణం అవుతున్న వైరస్ బీ1 రకానికి చెందినదిగా గుర్తించారు.
ఈ వైరస్ రకమే యూరప్ లోని వ్యాధి పెరగడానికి కారణం అవుతుంది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న కేసుల్లో ఎక్కువగా ఈ బీ1 రకానికి చెందిన మంకీపాక్స్ వైరస్ వల్లే కలుగుతున్నాయి. బీ1, ఏ2 రకానికి పూర్తి విభిన్నంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇప్పటికే ఈ వ్యాధిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. కొద్ది సమయంలోనే అనేక కేసులు నమోదు అవ్వడంతో ఈ నిర్నయం తీసుకుంది డబ్ల్యూహెచ్ ఓ.