నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రత్యక్షమై.. అంతలోనే అదృశ్యమవుతూ ప్రపంచవ్యాప్తంగా మిస్టరీగా మారిన లోహశిల ఇండియాలోనూ కలకలం రేపింది. అహ్మదాబాద్‌లోని ఓ పార్క్‌లో సుమారు 6 అడుగుల పొడవున్న శిల ఆశ్చర్యకరరీతిలో ప్రత్యక్షం కావడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకుముందు వెలుగుచూసిన ఘటనల్లోలాగే.. ఇండియాలో ప్రత్యక్షమైన శిల కూడా భూమిలో ఎప్పుడో పాతిపెట్టినట్టుగా ఉంది. చుట్టూ గుంత తవ్విన ఆనవాళ్లు గానీ, మట్టిగానీ కనిపించలేదు. పార్క్‌ను పర్యవేక్షించే గార్డ్ కూడా అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదని.. గతంలో ఎప్పుడూ అలాంటి శిల పార్క్‌లో కనిపించలేదంటూ ఆశ్చర్యపోతున్నాడు అంతకుముందు రోజు కూడా అక్కడేం లేదని.. రాత్రికి రాత్రి అది ఎలా ప్రత్యక్షమైందో తెలియడం లేదని చెప్తున్నాడు. శిలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఫోటోలను చూస్తోంటే.. శిలపై ఏవో అంకెలు, గుర్తులు కనిపిస్తున్నాయి. పార్క్ సిబ్బంది ప్రమేయం లేకుండా ఆ శిల అక్కడికి రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నా.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 30 పైగా నగరాల్లో ఇదే తరహాలో శిలలు ప్రత్యక్షమై.. మాయం కావడంతో ఈ విషయం మిస్టరీగా మారింది. ఈ శిలలను పెట్టి వెళ్తున్నది ఏలియన్స్ అయి ఉండొచ్చని.. ఆ దిశలో పరిశోధనలు కూడా చేస్తున్నారు శాస్త్రవేత్తలు.