రానున్న 24 గంటల్లో అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులపై రుతుపవనాలు విస్తరిస్తాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఇక బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాల పురోగమనానికి అనువుగా వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని ఐఎండీ అధికారులు తెలిపారు. ఇక ఇలా ఉంటే పశ్చిమ నైరుతి దిక్కుల నుంచి వీస్తున్న వేడిగాలుల ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందన్నారు.
దీంతో ఎండలు దంచి కొట్టడం ఈ రోజుల పాటు కంటిన్యూ అవుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా వెల్లడించింది. వచ్చే మూడు రోజుల్లో పొడి వాతావరణం ఉంటుందని, దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల వరకు నమోదవుతాయని వాతావరణ అధికారులు తెలిపారు.ఇక హైదరాబాద్ తో పాటు చుట్టు పక్కల జిల్లాల్లో కూడా పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగానే కొనసాగుతాయని తెలిపారు.
38 నుంచి 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు అధికారులు. ఇక గురువారం రాష్ట్రవ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ లో 41.3 డిగ్రీలు, ఖమ్మంలో 41.4, భద్రాచలంలో 39, హనుమకొండలో 39, హైదరాబాద్ లో 37.2, మహబూబ్ నగర్ లో 41, నిజామాబాద్ లో 40.4 రామగుండంలో 41.6 , మెదక్ లో 40.6 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే రానున్న మూడు రోజులు మరింత ఉష్ణోగ్రతలు పెరగనున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు అధికారులు సూచించారు.