పదేళ్లు అధికారానికి దూరమై ఈసారి ఎలాగైనా గెలవాలని చూస్తున్న కాంగ్రెస్ ఓవైపు.. మోడీ సర్కార్ ను కూల్చాలని ప్రాంతీయ పార్టీల నేతల వ్యూహాలు ఇంకోవైపు.. ప్రస్తుతం బలమైన ఎన్డీఏను కూల్చడం అంత తేలిక కాదనేది విశ్లేషకుల వాదన మరోవైపు.. ఈ నేపథ్యంలో సీ ఓటర్-ఇండియా టుడే చేసిన సర్వే విశ్లేషకుల అంచనాలే నిజమని చెబుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మరోసారి బీజేపీనే అధికారంలోకి వస్తుందని.. ప్రధానిగా వరుసగా మూడోసారి కూడా ప్రజలు నరేంద్ర మోడీనే కోరుకుంటున్నారని తెలిపింది.
543 స్థానాలున్న లోక్ సభలో ఎన్డీఏకు 296, యూపీఏకు 127, ఇతరులకు 120 స్థానాలు దక్కుతాయని అంచనా వేసింది ఇండియా టుడే. ఇందులో ఒక్క బీజేపీకే 271 స్థానాలు దక్కితే.. కాంగ్రెస్ కు 62, మిగతా పార్టీలకు 210 స్థానాలు వచ్చే అవకాశం ఉందని సర్వేలో వెల్లడించింది.
వచ్చే నెల జరిగే 5 రాష్ట్రాల ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలకు సెమిఫైనల్ గా భావిస్తున్నాయి పార్టీలు. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో ఏ పార్టీ గెలుస్తుందో అని అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే సర్వేల్లో మళ్లీ బీజేపేనే అధికారంలోకి వస్తుందని తేలింది.
యూపీ, గోవా మినహా మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తాయనే అంచనాలు ఉన్నాయి. అయితే.. జాతీయ స్థాయిలో మోడీకి, బీజేపీకి ఆదరణ చెక్కుచెదరలేదని ఇండియా టుడే సర్వే ద్వారా తెలుస్తోంది. రాష్ట్రాలకు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా ఉన్నా.. లోక్ సభ సీట్ల విషయానికొస్తే ప్రజలు బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారని కనిపిస్తోంది.