ఎల్ అండ్ టీ మెట్రోపై టీఆర్ఎస్ వైఖరి పూటకో రకంగా మారుతుంటుంది అనేది చరిత్ర చూస్తే తెలుస్తుంది. ఉద్యమ సమయంలో ఇది మెట్రో ప్రాజెక్టా… రియల్ ఎస్టెట్ అగ్రిమెంట్సా… అంటూ టీఆర్ఎస్ ఎన్నో ఆరోపణలు చేసింది. చారిత్రక కట్టడాల ముందు నుండి మెట్రో లైన్ ఎలా వేస్తారంటూ అసెంబ్లీ ముందు అలైన్మెంట్ మార్చమని వాదించింది. తీరా అధికారంలోకి వచ్చాక అవేవి కేసీఆర్ కు కనపడలేదు. తెర వెనుక ఏం జరిగిందో ఏమో కానీ మెట్రో తమ వల్లే అని గొప్పగా ప్రచారం కూడా చేసుకున్నారు.

కరోనా కారణంగా ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోకు భారీ నష్టాలొచ్చాయని, మెట్రోను అమ్మేయబోతున్నట్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత రోజుల వ్యవధిలో ఎల్ అండ్ టీ ముఖ్యులు కేసీఆర్ తో భేటీ అయ్యారు. నష్టాలను పూడ్చేందుకు కేటీఆర్ ఆద్వర్యంలో కమిటీ వేస్తున్నామని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అయితే, ఇప్పటికే ఎల్ అండ్ టీ సంస్థకు హైదరాబాద్ నగరంలోని ముఖ్య ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములు కట్టబెట్టారు. అక్కడ మాల్స్ ఏర్పాటు చేసుకొని 20ఏళ్లకు పైగా వాడుకునే వీలిచ్చారు. కానీ, ఇప్పుడు నష్టాల పేరుతో మరిన్ని భూములు కట్టబెట్టే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆ కంపెనీకి మేలు చేసే సమయంలో క్విడ్ ప్రోకోకు అవకాశం ఉందని… గతంలో ఆ సంస్థ బ్యాక్ గ్రౌండ్ పై ఎన్నో అనుమానాలు.. చర్చలు బయట ప్రచారంలో ఉన్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.