ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా మొదలైంది . ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు పారిశ్రామిక వేత్తల సమక్షంలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సును ప్రారంభించారు. రెండ్రోజుల పాటు జరిగే సదస్సుకు దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. ఈ సదస్సులో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ మాట్లాడుతూ…. ఏపీ వేదికగా వ్యవసాయ, వాటి అనుబంధ ఉత్పత్తులకు సంబంధించిన పెట్టుబడులు పెడుతామని చెప్పారు. ఇక్కడ్నుంచి దేశవ్యాప్తంగా సరఫరా చేస్తామని అన్నారు.
తమ పెట్టుబడుల ద్వారా 50 వేల ఉగ్యోగ అవకాశాలను కల్పిస్తామని అంబానీ ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 10 గిగావాట్ల రెన్యూబుల్ సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. నూతన భారతదేశ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ కీలకం కాబోతోందన్న ఆయన… ఏపీలో జియో నెట్‌వర్క్ అభివృద్ధి చెందిందని చెప్పుకొచ్చారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రగతికి ఏపీ సర్కార్ మంచి సహకారం అందిస్తోందన్నారు. ఏపీలో వనరులు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ .సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు.
ఏపీ సీఎం జగన్ నాయకత్వంలో విద్యారంగంపై చేస్తున్న కృషి ఎంతో అద్భుతమన్నారు సెయెంట్ గ్రూప్ వ్యవస్థాపక ఛైర్మన్ బీవీఆర్ మోహన్. విద్యార్థుల ఉన్నత చదవులకు ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యాకానుక, విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ, జగనన్న విదేశీ విద్యా దీవెన వంటి పథకాలు అద్భుతమని ప్రశంసించారు.
జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ జీఎంరావు మాట్లాడుతూ… “నా స్వరాష్ట్రం ఏపీ విశాఖపట్నంలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేయడాన్ని మేము గొప్పగా భావిస్తున్నాము. ఈ విమానాశ్రయం మొదటి దశ లో ఆరు మిలియన్ల ప్రయాణికులకు మరియు అంతిమ సామర్థ్యం 30 మిలియన్ల ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. మొదటి దశలో రూ. 5000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాం” అని చెప్పారు.