ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతోంది. 10 గంటలకు పైగా ఆమెను ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. గత విచారణ సదర్భంలో రాత్రి 8 గంటలకు బయటకొచారు కవిత. కానీ, ఈసారి 8.30 దాటినా బయటకు రాలేదు. సుదీర్ఘంగా విచారణ సాగుతోంది.
సాయంత్రం నుంచి ఈడీ కార్యాలయం దగ్గర హైటెన్షన్ నెలకొంది. 6 గంటలకే వాహనాలు సిద్ధం చేశారు కవిత అనుచరులు. ఇటు ఈడీ ఆఫీస్ దగ్గర మహిళా పోలీసులు, బలగాలను భారీగా మోహరించారు. ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.
ఈడీ విజిటర్స్ రూమ్ లో కవిత లాయర్లకు మాత్రమే అనుమతినిచ్చారు. మిగిలినవారిని పంపించివేశారు. విచారణ ఇంకా ఎంత సేపు జరుగుతుందో అనే ఉత్కంఠ ఉండగా.. గుమ్మడికాయతో దిష్టి తీసేందుకు దగ్గరలోనే బీఆర్ఎస్ శ్రేణులు ఎదురుచూస్తున్నారు.
ఈడీ ప్రశ్నలకు కవిత నుంచి ఎలాంటి రియాక్షన్ లేదని తెలియవచ్చింది. కవిత, అరుణ్ పిళ్లైని కలిపి అధికారులు విచారించారు. ముఖ్యంగా పిళ్లైతో కవితకు ఉన్న వ్యాపార సంబంధాలు, లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ పాత్రపై కవితను ఈడీ ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కన్ ఫ్రంటేషన్ పద్దతిలో కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు.
సాయంత్రం 6 గంటలు దాటితే మహిళను విచారించకూడదని.. అది చట్ట విరుద్ధమని కవిత సుప్రీంకోర్టును ఇప్పటికే ఆశ్రయించారు. అయితే.. రెండోసారి విచారణలో కూడా ఇదే సీన్ రిపీట్ కావడంతో ఈడీ కార్యాలయంలో ఏం జరుగుతోంది? ఏం జరగబోతోందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి.
మరోవైపు.. ఈడీ కార్యాలయానికి తెలంగాణ అడిషనల్ ఏజీ, సోమా భరత్, గండ్ర మోహన్ రావు వెళ్లారు. న్యాయవాదులు ఎందుకొచ్చారు? కవితను అరెస్ట్ చేసే సూచనలు ఏమైనా ఉన్నాయా? అనేది బీఆర్ఎస్ పెద్దలకు అర్థం కావట్లేదు. ఉదయం నుంచి ఈడీ కార్యాలయం చుట్టుపక్కల పరిస్థితి అంతా సాధారణంగానే ఉంది. అయితే.. ఆఫీసు దగ్గరికి న్యాయవాదులు వచ్చేసరికి ఒక్కసారిగా సీన్ మారిపోయింది. దీంతో ఏం జరుగుతోందో ఏంటో అని బీఆర్ఎస్ శ్రేణులు టీవీలకు అతుక్కుపోయి చూస్తున్నారు.
డాక్టర్లు కూడా ఈడీ కార్యాలయంలోకి వెళ్లడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ మరింత పెరిగిపోయింది. ఇదివరకే న్యాయవాదులు ఈడీ కార్యాలయంలోకి వెళ్లడం.. తర్వాత ఇద్దరు వైద్యులు కూడా వెళ్లడంతో ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి. అయితే.. డాక్టర్లు ఎందుకు లోపలికి వెళ్లారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.