థాయ్‌లాండ్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ ఉన్మాది విచక్షణరహితంగా కాల్పులు జరపడంతో 30 మంది మరణించారు. వారిలో 23 మంది చిన్నారులు కూడా ఉన్నారు. కాల్పుల అనంతరం ఆ దుండగుడు తనకు తాను కాల్చుకుని ప్రాణాలు విడిచాడు.
థాయ్‌లాండ్‌లోని నోంగ్బువా లంఫూ పట్టణంలోని చిల్డ్రన్స్ డే కేర్ సెంటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. డే కేర్ సెంటర్ లోకి దుండగుడు గురువారం తుపాకీతో చొరబడ్డాడు. వెంటనే విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు.
కనీసం చిన్న పిల్లలు అనే కనికరం కూడా చూపకుండా వారిపై తూటాల వర్షం కురిపించాడు. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలిసే లోగానే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఆ ఉన్మాదిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసుల పైనా కాల్పులకు తెగబడ్డాడు. చివరగా తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరణించిన వారిలో 23 మంది చిన్నారులు, ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక పోలీస్ ఉన్నారని అధికారులు వెల్లడించారు.