ఆదిలాబాద్ గ్రామీణ కస్తూర్భా గాంధీ పాఠశాలలో 40మందికి పైగా బాలికలు అస్వస్థతకు గురయ్యారు. బ్రేక్ ఫాస్ట్ చేసిన కాసేపటికే వరుసగా ఒక్కొక్కరు వాంతులు చేసుకోవటం ప్రారంభించారు.
ఈ విషయం కాస్తా బయటకి తెలియటంతో కొంతమంది మీడియా ప్రతినిధులు పాఠశాలకు వెళ్లారు. అప్పటికీ బాలికలు బాగా ఇబ్బంది పడుతూ కనిపించారు. దీంతో వారిని మీడియా ప్రతినిధుల వాహనాలు, ఆటోల్లో రిమ్స్ కు తరలించారు.
విషయం తెలిసిన కలెక్టర్ సిక్తా పట్నాయక్, డీఈవో ప్రణీత ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై డైరెక్టర్ జై సింగ్ ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉంది.
ఈ ఘటనకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు కలెక్టర్.