మెక్సికోలో ఓ ట్రక్కులో భారీగా మృత దేహాలు లభ్యమవ్వడం తీవ్ర కలకలం సృష్టించింది. శాన్ ఆంటోనియోలో రిమోట్ బ్యాక్ రోడ్డులో వెళ్తున్న ట్రక్కులో 46 మృతదేహాలను అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు ఉలిక్కి పడ్డారు.
సోమవారం సాయంత్రం వాహనం దగ్గర ఓ వ్యక్తి సహాయం కోసం బిగ్గరగా కేకలు వేసినట్టు అధికారులు తెలిపారు. దీంతో తాము అప్రమత్తమై వెంటనే వాహనంలో తనిఖీలు చేసినట్టు చెప్పారు. దీంతో లోపల మృత దేహాలు లభించినట్టు వివరించారు.
ఆ సమయంలో ట్రక్కులో ఉన్న మరో 16 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు. వారి శరీరాలను తాకి చూడగా చాలా వేడిగా అనిపించిందని, వారంతా డీ హైడ్రేట్ అయ్యారని అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. వీరంతా అమెరికాలోని దక్షిణ టెక్సాస్ ప్రాంతానికి అక్రమంగా వలస వెళ్లే క్రమంలో ఈ ఘటన జరిగి వుంటుందని తాము అనుమానిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.