మనీష్ సిసోడియా అరెస్టును సీబీఐ అధికారుల్లో చాలామంది వ్యతిరేకించారని తనకు సమాచారమందిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కానీ ఒత్తిడి కారణంగా వారు తమ ‘పొలిటికల్ మాస్టర్ల’ ఆదేశాలను పాటించవలసివచ్చిందన్నారు. సిబిఐ అధికారుల్లో చాలామందికి మనీష్ సిసోడియా అంటే ఎంతో గౌరవం ఉందని, కానీ విపరీతమైన రాజకీయ ఒత్తిడి కారణంగా వారు తమ ‘పైవారి’ ఉత్తర్వులను పాటించవలసి వచ్చిందని తనకు తెలిసిందని కేజ్రీవాల్ చెప్పారు.
తన డిప్యూటీ సిసోడియా అరెస్టు ‘చెత్త రాజకీయాలు’ కారణంగానే జరిగిందని, ఆయన నిర్దోషి అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. సిసోడియాకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు లేకపోయినా కేవలం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి సిబిఐ ఆయనను అరెస్టు చేసిందన్నారు.
ఇక, సిసోడియాను 5 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని సిబిఐ.. కోర్టును కోరింది. తమ నేత అరెస్టును ఖండిస్తూ ఢిల్లీలో ఆప్ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.
తమను అదుపు చేయడానికి వచ్చిన పోలీసులపై తిరగబడ్డారు. ఢిల్లీ లోని ఆప్ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులకు, వీరికి మధ్య ఘర్షణలు జరిగాయి. చండీగఢ్, భోపాల్ వంటి నగరాల్లోనూ ఆప్ నిరసన ప్రదర్శనలను నిర్వహించింది.