అమ్మంటే త్యాగం…అమ్మంటే అనురాగం. అమ్మంటే నమ్మకం మనకోసం తపించే మనసు.. అమ్మంటే మనకోసం మళ్ళీ జన్మనెత్తే ప్రాణం. మరి అలాంటి అమ్మ ఎదురుగా మనకు హాని జరిగితే ఆమె ఊరుకోగలుగుతుందా..! అలా ఉండగలిగితే ఆమె అమ్మఅవుతుందా..!? రెండేళ్ళ కొడుకుని కాపాడుకోవడం కోసం హైనాతో 3 కిలోమీటర్లు పరుగులు తీసింది.
అమ్మమనసుకు అద్దంపట్టే ఈ సంఘటన ఛత్తిస్గఢ్లో జగ్దల్పుర్ జిల్లా చిత్రకోట్ అటవీ ప్రాంతంలో జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారం..తోకపాల్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని నైన్నార్ గ్రామంలో 2 సంవత్సరాల బాలుడు తన ఇంటి ప్రాంగణంలో ఆడుకుంటున్నాడు.
అంతలో పొదల్లో దాగిఉన్న హైనా బాలుడు ఒంటరిగా ఉండటం చూసి వచ్చి చిన్నారిపై దాడి చేసింది. అతడిని నోట్లో పెట్టుకుని అడవి వైపు పరిగెత్తడం ప్రారంభించింది.
ఇంతలో తల్లి హైనాను గమనించింది. వెంటనే తల్లి అలర్ట్ అయ్యి హైనా వెనక పరిగెత్తడం ప్రారంభించింది. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడింది. హైనా నుంచి తన బిడ్డను రక్షించడానికి 3కిలోమీటర్ల మేర పరిగెత్తింది.
తల్లి పరిగెత్తడం చూసి చుట్టుపక్కల వారు కూడా ఆమెతో పాటు పరుగులు తీశారు. హైనా నుంచి బాలుడిని విడిపించడంలో గ్రామస్థులు కూడా సహాయపడ్డారు. ఎట్టకేలకు బాలుడిని హైనా నుంచి విడిపించారు.
వెంటనే బస్తర్‌లోని డిమ్రాపాల్ ఆసుపత్రికి తరలించారు. కానీ లాభం లేకపోయింది. చికిత్స పొందుతూ ఒక గంట తర్వాత బాలుడు తన ప్రాణాలు విడిచాడు.అమ్మకష్టం వృధాఅయ్యింది.ఆమెకు గుండెకోత మాత్రం మిగిలింది.
ఈ ఘటనతో నైన్నార్ గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా భయాందోళన నెలకొంది. చిన్న పిల్లల భద్రతపై ప్రజల్లో ఆందోళన పెరిగింది. ‘ప్రాణనష్టానికి రూ.6 లక్షల పరిహారం ఇవ్వాలని నిబంధన ఉంది. ముందుగానే బాధిత కుటుంబానికి రూ.25 వేలు అడ్వాన్స్‌గా అందించాం” అని చిత్రకోట్ ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రకాశ్ ఠాకూర్ వెల్లడించారు.