కరోనా విషయంలో మన దేశంలో చాలా మంది కనీసం అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారు. కరోనా విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారం కూడా కొందరిలో భయానికి కారణం అవుతుంది. కరోనాకు సంబంధించి ప్రజలకు ప్రభుత్వాలతో పాటు స్వచ్చంద సేవా సంస్థలు కూడా ఎన్నో విధాలుగా అవగాహన కల్పిస్తున్నా సరే మీడియాలో వస్తున్న వార్తలు చూసి లేనిపోని భయాలు పెట్టుకుని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది అనే మాట వాస్తవం.
తాజాగా తమిళనాడులో ఒక ఘటన చోటు చేసుకుంది. తమిళనాడులోని మధురైలో కోవిడ్-19 ఇన్ఫెక్షన్ సోకుతుందనే భయంతో 23 ఏళ్ల మహిళతో పాటుగా ఆమె మూడేళ్ల కుమారుడు విషం తాగి ప్రాణాలు తీసుకున్నారు. ఆమెతో పాటుగా ఆమె సోదరులతో సహా కుటుంబంలోని ఐదుగురు కూడా ఇదే విధంగా కరోనాకు భయపడి విషం తాగారు. వీరిలో ముగ్గురు ప్రాణాలతో బయటపడగా, ఆ మహిళ, ఆమె మూడేళ్ల చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
ఆమె భర్త నాగరాజ్‌ను కరోనాతో కోల్పోయింది. అప్పటి నుంచి తాను కూడా కరోనాతో తాను, తన కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోతుంది అని భయపడి ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. మృతురాలు జోతిక తన భర్త ప్రాణాలు కోల్పోయిన తర్వాత తల్లి వద్ద ఉంటోంది. జనవరి 8న జోతికకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఇక అక్కడి నుంచి ఫ్యామిలీ మొత్తం తమకు కూడా కరోనా సోకుతుంది అనే భయంతో ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. వీరు విషం తాగడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వాళ్ళు వచ్చి అందరిని ఆస్పత్రికి తీసుకు వెళ్ళగా ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు.