ఎన్నో సంవత్సరాలుగా కలలు కంటున్న భవిష్యత్తు ఓ పక్క.. పేగు పంచుకుని పుట్టిన బంధం మరో పక్క. పరీక్షలో మంచి మార్కులు వచ్చి సెలెక్ట్ అయితే తనతో పాటు తన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని ఆలోచించారు ఈ తల్లులు. అందుకే రోజుల బిడ్డలు, నెలల పాపలతో ఈరోజు జరిగిన గ్రూప్ -1 పరీక్షకు హాజరయ్యారు.
వరంగల్ ఏఎస్ఎం కాలేజ్ లో జరిగిన గ్రూప్ -1 పరీక్షకు హుస్నాబాద్ కు చెందిన సుమలత అనే మహిళ వచ్చింది. ఈమెకు 15 రోజుల క్రితమే ఆడపిల్ల జన్మించింది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న గ్రూప్ -1 పరీక్ష కూడా రావడంతో పసిబిడ్డతోనే పరీక్ష కేంద్రానికి వచ్చింది.
పాప తండ్రి తరుణ్ పాపను ఎత్తుకొని బయట తిప్పుతూండగా సుమలత పరీక్షకు హాజరైంది. అయితే పాప తల్లి పాల కోసం బాగా గుక్క పెట్టి ఏడవడంతో తరుణ్ అధికారులను అడిగినప్పటికీ రూల్స్ కు విరుద్దంగా ఏమి చేయాలేమని వారు చెప్పారు.
దాంతో తరుణ్ నిరాశగా పాపకు డబ్బా పాలు పట్టడం అక్కడే ఉన్న పలువురిని కంటతడి పెట్టుస్తోంది. మరికొన్ని చోట్ల చంటి బిడ్డలతో తల్లులు పరీక్షకు హాజరు కాగా ఆమె వెంట వచ్చిన వారు బిడ్డలను పట్టుకొని పరీక్షాకేంద్రాల బయటే వేచి చూశారు.