ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ, చైర్మన్ అమితాబ్ బెనర్జీ .. తన కంపెనీ సొమ్మును దర్జాగా తన కుటుంబ అవసరాల కోసం వినియోగించుకుంటూ సంస్ధకు లక్షల్లో నష్టం కలగజేస్తున్నట్టు వెల్లడైంది. ఎండీ హోదాలో ఉన్న పదవిని అడ్డం పెట్టుకుని, తరచూ తన విదేశీ ప్రయాణాలకు వీసా, ఇతర ఖర్చులకు జేబు నుంచి ఒక్క పైసా అయినా తీయకుండా ఎంచక్కా సంస్థ సొమ్ములనే వాడుతూ వచ్చాడట. ఈయన బండారం బయటపడడంతో ఆరోపణలు వెల్లువెత్తి ఈ నెల 15 న ఈయనను రైల్వే మంత్రిత్వ శాఖ తొలగించింది. అధికారిక కారును దుర్వినియోగం చేయడం, పర్సనల్ పాస్ పోర్టు పై విదేశీ ప్రయాణం కోసం పదేళ్ల కాలానికి వీసా తీసుకోవడానికి, ఢిల్లీలో ‘గెస్టు హౌస్’ గా చెబుతున్న తన ఇంటి ఖర్చులకు .. ఇలా తన వ్యక్తిగత అవసరాలకన్నింటికీ అమితాబ్ బెనర్జీ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కే ఎసరు పెడుతూ వచ్చాడట.
రోలింగ్ స్టాక్ తదితరాలకు, ఇతర ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సామాగ్రి కొనుగోలు కోసం రైల్వే శాఖ మంజూరు చేసే నిధులను ఈయన దారి మళ్లించి తన ఖర్చులకు వినియోగించుకున్నాడని వెల్లడైంది. అవినీతి ఆరోపణలకు గురైన నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ ఎండీ సతీష్ అగ్నిహోత్రి మాదిరే ఈయనా అలాగే అడ్డదారి తొక్కాడు. అగ్నిహోత్రిని ఎలా రైల్వే మంత్రిత్వ శాఖ వదిలించుకుందో అలాగే బెనర్జీని కూడా ఉన్నతాధికారులు వదిలించుకున్నారు.
ఢిల్లీలో తన కుటుంబం వాడే ప్రతి వస్తువుకూ పండ్లు, కూరగాయలు, ఇంటికి అవసరమైన అన్ని సామాన్లకూ ఈ అధికారి ప్రతినెలా వేలకొద్దీ కంపెనీ డబ్బులను వాడుకున్నాడని తేలింది. పైగా వాటికి బిల్లులు కూడా ఉండేవి కావు. ఇక కుక్, హెల్పర్, క్లీనింగ్ స్టాఫ్.. నౌకర్లు, చాకర్లకందరికీ జీతాలు తన కంపెనీ నుంచే చెల్లిస్తూ వచ్చాడు. బ్రిటన్ వెళ్ళడానికి 10 ఏళ్ళ వీసా కోసం 2019 లోనే లక్ష రూపాయలు బిల్లు పెట్టాడట. చివరకు టవల్స్ ఖర్చు కూడా సంస్థ ఖర్చులోనే కలిపేయడం చూసి విచారణ అధికారులు ఆశ్చర్యపోయారు.
గత ఏడాది ఏప్రిల్ లో కోవిడ్ కి గురైన తన తల్లిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించడానికి ఈయన అంబులెన్స్ చార్జిగా లక్షన్నర రూపాయల బిల్లు పెట్టి రీ-ఇంబర్స్ చేసుకున్నాడు, అయితే తనపై వచ్చిన ఆరోపణలన్నీ అబద్దాలని, కేవలం తన ఇంటి అవసరాలు , యూకే విజిట్ కోసమే తాను ఖర్చు పెట్టానని అమితాబ్ బెనర్జీ అంటున్నారు. ఏమైనా యూకే, సింగపూర్ వంటి విదేశాలకు ఈయన తన సంస్థ సొమ్ములతోనే ప్రయాణాలు సాగించాడని డాక్యుమెంట్లు రుజువు చేశాయి. లోగడ హిందుస్థాన్ పేపర్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థకు డైరెక్టరుగా వ్యవహరించినప్పుడు కూడా ఈయన అవినీతికి పాల్పడ్డాడని సీబీఐ గతంలో పేర్కొంది. కానీ ఎందుకో ఎలాంటి ఆరోపణలు మోపకుండానే క్లోజర్ రిపోర్టును సమర్పించింది.