హిజాబ్ విషయంలో అమెరికా కామెంట్స్ పై భారత్ స్పందన
హిజాబ్ వివాదంపై అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. హిజాబ్ విషయంలో అమెరికా ప్రేరేపిత వ్యాఖ్యలను తాము స్వాగతించబోమని భారత్ వెల్లడించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మీడియా సమావేశంలో మాట్లాడారు.
‘ కర్ణాటకలో విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై వివాదం నడుస్తోంది. ఆ అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ అంశంపై హైకోర్టు పూర్తిస్థాయిలో విచారణలు జరుపుతోంది. ఇలాంటి సమయంలో అమెరికా వ్యాఖ్యలు సరికావు. భారత్ గురించి బాగా తెలిసిన వారు వాస్తవాలను సరిగ్గా అర్థం చేసుకునే వారు. వాస్తవాలు తెలుసుకోకుండా చేసే ప్రేరేపిత వ్యాఖ్యలను మేము స్వాగతించలేము” అని అన్నారు.
‘ కర్ణాటకలో హిజాబ్ ధరించడాన్ని నిషేధించవద్దు. అలా చేయడం మత స్వాతంత్య్రాన్ని ఉల్లంఘించడమే అవుతుంది ” అని అంతర్జాతీయ మత స్వేచ్చకు అమెరికా రాయభారి శుక్రవారం అన్నారు.
మతపరమైన దుస్తులను ఎంచుకునే స్వేచ్చ మతపరమైన స్వాతంత్ర్య హక్కులో భాగంగానే ఉంటుంది. హిజాబ్ ధరించడంపై పరిమితులను భారత్ లోని కర్ణాటక రాష్ట్రం విధించకూడదు. అలా చేస్తే మత స్వాతంత్ర్య హక్కును ఉల్లంఘించినట్టు అవుతుంది.అది స్త్రీలు, బాలికలను చిన్న చూపు చూడటమే” అని అన్నారు.