– మోస్ట్ పాపులర్ సీఎంలపై సర్వే
– జాతీయ స్థాయిలో.. రాష్ట్ర స్థాయిలో..
– తగ్గిపోయిన కేసీఆర్ గ్రాఫ్!
– టాప్ లో కనిపించని సారు పేరు
తగ్గిపోతున్న ప్రజాధరణ.. బలపడుతున్న ప్రతిపక్షాలు.. రోజురోజుకీ దిగజారిపోతున్న గ్రాఫ్.. ఏం చేద్దామన్నా రివర్స్ కొడుతోంది. జనాలు అసలు పట్టించుకోవడం లేదు. ముందస్తుకు వెళ్దామన్న ఆలోచనలో ఉన్న కేసీఆర్ కు ఇప్పుడివే కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇన్నాళ్లూ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న సారుకు.. యమ స్పీడ్ మీదున్న కారుకు మెల్లిమెల్లిగా బ్రేకులు పడుతూ వస్తున్నాయి. హుజూరాబాద్ ఫలితం తర్వాత ప్రతీ విషయంలో చుక్కలు కనపడుతున్నాయి.
ప్రజాధరణ తగ్గుతోందని ఇంటెలిజెన్స్ రిపోర్టులు వచ్చిన ప్రతీసారీ ఏదో ఒక మ్యాజిక్ చేయడం ఏడున్నరేళ్లుగా కేసీఆర్ చేస్తున్నదే. ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ అంటూ జాతీయ రాజకీయాల పేరుతో హడావుడి చేస్తున్నా.. ఎలాంటి ఉపయోగం ఉండదనేది మరోసారి బయటపడింది. జాతీయ స్థాయిలో కేసీఆర్ పరిస్థితి కింది స్థాయిలో ఉన్నట్లు తేలిపోయింది. తాజాగా ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట మోస్ట్ పాపులర్ సీఎం కేటగిరీలో రెండు సర్వేలు నిర్వహించింది. ఒకటి జాతీయ స్థాయిలో, మరొకటి సొంత రాష్ట్రాల్లో చేసింది. ఈ రెండు సర్వేల లిస్టుల్లో కేసీఆర్ పేరు ఎక్కడో కిందిస్థాయిలో ఉంది.
జాతీయ స్థాయిలో మోస్ట్ పాపులర్ సీఎం కేటగిరీలో మొదటి స్థానంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిలిచారు. తర్వాతి స్థానంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆ తర్వాత స్థానాల్లో మమతా బెనర్జీ, స్టాలిన్, ఉద్దవ్ థాక్రే ఉన్నారు. ఈ కేటగిరీలో టాప్ లిస్ట్ లో కేసీఆర్ పేరు కనిపించలేదు. ఇక సొంత రాష్ట్రాల్లో జరిగిన సర్వేలోనూ కిందే ఉన్నారు. ఇందులో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మొదటి స్థానంలో ఉండగా, బెంగాల్ సీఎం మమతా రెండోస్థానంలో నిలిచారు. ఆ తర్వాత స్టాలిన్, ఉద్దవ్, పినరయి, కేజ్రీవాల్, హిమంత శర్మ ఉన్నారు.
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న కేసీఆర్.. కనీసం సీఎంగా జాతీయస్థాయిలో గుర్తింపు కూడా తెచ్చుకోలేదు. అలాగే రాష్ట్ర స్థాయిలోనూ వెనుకబడ్డారు. దీన్నిబట్టి కేసీఆర్ గ్రాఫ్ మరింత దిగజారిపోయిందని అర్థం అవుతోందని అంటున్నారు విశ్లేషకులు.